టీడీపీ కీలక నాయకుడిగా పేరున్న కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నేత సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేశారు. అంతర్గత కుమ్ములాటలు.. పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఈనిర్ణయం తీసుకున్నట్టు సుగవాసి అనుచరులు చెబుతున్నారు. పార్టీలో అత్యంత విశ్వాస పాత్రుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన మహానాడుకు ఆయన రాకపోవడంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది.
రాజంపేట నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో సుగవాసి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా కొనసాగినా.. రాజంపేటలో మాత్రం వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. తను ఓడి పోవడానికి సొంత పార్టీ నాయకులేనని సుగవాసి అప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. సుగ వాసి వైసీపీ నుంచి వచ్చారని.. ఆయన కోవర్టుగా పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో సుగవాసికి వ్యతిరేకంగా చెంగల్‌రాయుడు వర్గం ఆందోళనలను నిరసనలు కూడా చేసింది.
ఈ వ్యవహారం గతంలోనే అమరావతికి వచ్చింది. అప్పట్లో సర్ది చెప్పారు. కలిసి పనిచేయాలని కూడా చంద్రబాబు సూచించారు. కానీ, కలయిక సాధ్యం కాలేదు. పైగా.. రోజు రోజుకు కూడా వివాదాలు పెరిగాయి. ఇటీవల జరిగిన మహానాడులో సుగవాసి వర్గం దూరంగా ఉంది. పైకి కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చినా.. చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చారు. ఈ పరిణామాలపై అప్పట్లోనే చర్చించాలని భావించారు. కానీ, సాధ్యం కాలేదు. తాజాగా సుగవాసి పార్టీకి రిజైన్ చేశారు.
తన రాజీనామా లేఖలో “ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను…” అని సుగవాసి పేర్కొనడం గమనార్హం. అయితే.. ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, అక్కడ కూడా తలుపులు తెరిచేవారు ఎవరూ లేరని.. టీడీపీ నాయకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు.. కడపలో 10 స్థానాలు వచ్చే ఎన్నికల్లో విజయందక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీకి ఇప్పుడు సుగవాసి రాజీనామా ఇబ్బంది పెట్టే అంశమేనని అంటున్నారు పరిశీలకులు.