పిఠాపురంలో పొలిటిక‌ల్ హీట్‌?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. గ‌త నాలుగు రోజులుగా ఇక్క‌డ ఇసుక త‌వ్వ‌కాలు అన‌ధికారికంగా జ‌రుగుతున్నాయ‌ని.. ప‌ట్టించుకునే నాధుడు కూడా లేడ‌ని.. సాక్షాత్తూ.. టీడీపీ నాయ‌కుడు, ప‌వ‌న్ కోసం టికెట్ త్యాగం చేసిన వ‌ర్మ ఆరోపించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతానికి మీడియాను కూడా తీసుకువెళ్లారు. స్తానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో పేరు చెప్ప‌కుండా.. కొంద‌రు నాయ‌కుల‌పైనా విమ‌ర్శ‌లు చేశారు.

అదేవిదంగా పోలీసుల‌పైనా వ‌ర్మ విరుచుకుప‌డ్డారు. పోలీసుల‌కు త‌గిన మొత్తంలో రావాల్సిన‌వి, కావాల్సిన‌వి అందుతున్నాయని.. అందుకే ఇంత అక్ర‌మాలు జ‌రుగుతున్నా.. ఎవ‌రూ నోరు విప్ప‌డం లేద‌ని.. క‌నీసం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న కూడా చేయ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక్క‌డ ఒక్క చెరువు నిర్మాణానికి మాత్ర‌మే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అనుమ‌తి ఇచ్చార‌ని.. కానీ, కొంద‌రు ఇక్క‌డ చెల‌రేగిపోతున్నార‌ని.. చెప్పుకొచ్చారు. ఇదేస‌మ‌యంలో పోలీసుల‌కు రేచీక‌టి వ‌చ్చింద‌ని.. వారు ఇబ్బంది ప‌డుతున్నార‌ని సెటైర్లు వేశారు. వారికి స‌రైన క‌ళ్ల‌ద్దాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌న్నారు.

ఈ ప‌రిణామం అటు టీడీపీలోను, ఇటు జ‌న‌సేన‌లోనూ రాజకీయ కాక పెంచింది. వ‌ర్మ ఎవ‌రినీ నేరుగా టార్గెట్ చేయ‌క‌పోయిన‌ప్పటికీ.. స్థానికంగా ఉన్న జ‌న‌సేన నాయ‌కులు మాత్రం ఆయ‌నపై నిప్పులు చెరుగుతున్నారు. కూట‌మి మిత్ర ధ‌ర్మాన్ని కూడా వ‌ర్మ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న‌ను ఉపేక్షిస్తే.. ఎలా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు వ‌ర్మ వ‌ర్గం.. ఆయ‌న‌ను వెనుకేసుకు వచ్చింది. కూట‌మి ప్ర‌భుత్వం త‌ప్పులు చేయ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే వ‌ర్మ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చార‌ని అంటున్నారు. మ‌రోవైపు.. ఈ వ్య‌వ‌హారాల‌ను అటు టీడీపీ, ఇటు జ‌న‌సేన కీల‌క నాయ‌క‌లు ప‌రిశీలిస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎవ‌రిపైనా చ‌ర్య‌లు తీసుకునే ఉద్దేశం లేద‌ని సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు. ప‌రిస్థితిని పార్టీ పెద్ద‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని.. స‌మ‌యం చూసుకుని త‌గిన విధంగా స్పందిస్తార‌ని ఇరు పార్టీల నాయ‌కులు అంటున్నారు. కానీ.. వ‌ర్మ వ‌ర్గం మాత్రం ఆయ‌న ప‌ర్య‌వేక్షించ‌డం వ‌ల్లే అక్ర‌మాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని.. ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. లేక‌పోతే.. ఆయ‌న‌తోపాటు టీడీపీకి కూడా బ్యాడ్ నేమ్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్మ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయింది.