=

తెలంగాణ ప్ర‌భుత్వం… బియ్యం వ్యాపారం!

ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మాత్ర‌మే ఉండాల‌న్న‌ది ఒకప్ప‌టి మాట‌. అయితే.. త‌ర‌చుగా ప్ర‌ధాని మోడీ కూడా ఇదే మాట చెబుతారు. వ్యాపారం చేసేందుకు మేం లేమంటూ.. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌ల‌లో వాటాను వెన‌క్కి తీసుకుంటున్నారు. అయితే.. కాలానికి అనుగుణంగా మార్పులు ఎలా కీల‌క‌మో.. ప్ర‌భుత్వాలు కూడా అంతే. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు.. కూడా వ్యాపారాల‌ను చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగానికి, ఆతిథ్య రంగానికి కూడా.. ప్ర‌భుత్వాలు పెద్ద‌పీట వేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం బియ్యం వ్యాపారంలోకి అడుగు పెట్ట‌నుంది. గ‌తంలో మోడీ తీసుకువ‌చ్చిన ‘భార‌త్ బ్రాండ్‌’ బియ్యం త‌ర‌హాలోనే.. తెలంగాణ‌లోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ‘తెలంగాణ బ్రాండ్ రైస్‌’ పేరిట బ‌హిరంగ మార్కెట్‌లో బియ్యాన్ని విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి వ్యాపార వేత్త‌ల‌తో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో స‌న్న‌ర‌కాల బియ్య పంట పెరిగింది. దీంతో ఉత్ప‌త్తి కూడా అంతే వ‌చ్చింది.

కానీ, అవ‌స‌రాల‌కు పోను.. మిగిలిన మొత్తాన్ని ఏం చేయాల‌న్న విష‌యం స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసింది. గ‌త నెల నుంచి పేద‌ల‌కు రేష‌న్ కార్డుపై స‌న్న‌బియ్యాన్నే ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది పోను.. మిగిలిన బియ్యాన్ని 5-10-20 కేజీల రూపంలో ప్యాక్ చేయించి.. తెలంగాణ బ్రాండ్ పేరుతో బ‌హిరంగ మార్కెట్‌లో విక్ర‌యించేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. వీటిలో ‘జైశ్రీరాం’, ఆర్ఎస్ఆర్ ర‌కాల బియ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. వీటిని ఎక్కువ మంది తింటున్న నేప‌థ్యంలో ఈ బ్రాండ్ల‌కు మార్కె ట్ బాగుంటుంద‌ని భావిస్తున్నారు.

ఇక‌, ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే.. లాభాపేక్ష లేకుండానే ప్ర‌భుత్వం వీటిని విక్ర‌యించాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతానికి అయితే.. బ‌హిరంగ మార్కెట్‌లో కిలో స‌న్న‌బియ్యం 70 రూపాల‌కు త‌క్కువ లేదు. కొన్ని చోట్ల రూ.100 కూడా ప‌లుకుతున్నాయ‌ని ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో స‌ర‌మైన ధ‌ర‌ల‌కు.. స‌న్న‌బియ్యాన్ని ప్యాక్‌లుగా చేయించి విక్ర‌యించాల‌న్న త‌లంపులో ప్ర‌భుత్వం ఉంది. కానీ, దీనికి మిల్ల‌ర్లు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. రాష్ట్రంలోని మెజారిటీ మిల్ల‌ర్లు.. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.