నిబద్ధతలో జన సైనికులను మించినోళ్లు లేరు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోట నుంచి ఓ మాట వచ్చిందంటే… ఓ రోజు అటూఇటూ కావచ్చు గానీ ఆ మాట అయితే నెరవేరి తీరుతుంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా… అసలు రాజకీయాల్లోనే లేకున్నా కూడా పవన్ ఇప్పటికే ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలను తన సొంత నిధులతో చేపట్టారు. వెరసి పవన్ నిబద్ధతకు మారుపేరుగా నిలిచారని చెప్పాలి. ఇప్పుడు తమ పార్టీ అధినేత పవన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారు జన సైనికులు. పవన్ బాటలోనే తామూ సాగుతామంటూ వారు చెప్పడం కాదు చేసి మరీ నిరూపిస్తున్నారు. 

ఇటీవల జరిగిన పహల్ గాం ఉగ్రవాద దాడి యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఈ దాడిలో 26 మంది భారత పౌరులు మృత్యువాత పడ్డారు. వారిలో ఇద్దరు ఏపీ వాసులు ఉన్నారు. ఆ ఇద్దరిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సోమిశెట్టి మధుసూదన్ రావు చనిపోయారు. ఈయన ఆది నుంచి కూడా పవన్ కు వీరాభిమాని, జనసేన ఆవిర్భావం తర్వాత జనసేనలోనూ ఆయన క్రియాశీలంగా వ్వవహరిస్తున్నారు. పహల్ గాం దాడిలో మధుసూదన్ చనిపోయారన్న వార్త జనసేన అదిష్ఠానంతో పాటు పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మధుసూదన్ కుటుంబానికి పవన్ రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

సదరు సరిహారాన్ని పవన్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ నిన్న కావలిలో మధుసూదన్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్బంగా మధుసూదన్ సతీమణి కామాక్షి ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నిబద్ధతకు, తమ కుటుంబానికి అండగా నిలిచిన తీరుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఆమె ఓ ఆసక్తికర ప్రకటన కూడా చేశారు. తన ఇద్దరు పిల్లలు పెద్దవారై ప్రయోజకులుగా మారిన తర్వాత ఇదే రూ.50 లక్షలను పార్టీకి డొనేట్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేందుకు పార్టీ సాయం చేస్తే… తాము బాగుపడిన తర్వాత పార్టీ మరింత మందికి వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కామాక్షి ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

రాజకీయ పార్టీలు అన్నాక… ప్రజల ముందు చెప్పిన మాటను ప్రజలను వదిలేసి వెళ్లిన తర్వాత ఆ విషయాలను ఆ పార్టీలు గానీ, ఆ పార్టీలకు చెందిన నేతలు గానీ పెద్దగా పట్టించుకోరు. ఇందుకు ప్రబల నిదర్శనమే బెజవాడ వరదల సందర్భంగా జగన్ రూ.1 కోటి సహాయాన్ని ప్రకటించారు. అయితే ఆ నిధులను ఆయన ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందించిందే లేదు. అదేమంటే… ఆ రూ.1 కోటితో పాటు మరింత మేర నిధులతో నేరుగా ప్రజలకే సేవ చేశామని వైసీపీ తనదైన వివరణను ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఇచ్చిన మాట ప్రకారం సాయం చేయడం, ఆ సాయానికి ప్రతిగా పార్టీకి భవిష్యత్తులో తాము అండగా ఉంటామని కామాక్షి ప్రకటించిన తీరు నిజంగానే ఆదర్శనీయమేనని చెప్పక తప్పదు.