చంద్రబాబు 4.0 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు.. అమరావతి, పోలవరం, బనకచర్ల. ఈ ప్రాజెక్టులను ఒక టైంబౌండ్ పెట్టుకుని మరీ పూర్తి చేయాలని సంకల్పించారు. ముఖ్యంగా అమరావతి విషయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో వైసీపీ వచ్చాక.. రాజధానిని నిర్మానుష్యంగా మార్చిన విషయం తెలిసిందే. అంతేకాదు.. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రకటించారు. దీంతో రైతులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు అలాంటి పరిస్థితి కల్పించకుండా.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజధానిగా అమరావతిని నోటిఫై(గుర్తించడం) చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇక, మరోవైపు.. ప్రస్తుతం ఉన్న 33 వేల ఎకరాలు కూడా సరిపోవని.. భావిస్తున్న సర్కారు మరో 44 వేల ఎకరాలను సేకరిస్తోంది. వీటిని కూడా భూసమీకరణ విధానంలోనే తీసుకునేందుకు ప్రయత్నంచేస్తోంది. తద్వారా అమరావతిలోనే అంతర్జాతీయ విమానం, పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని పక్కాప్లాన్ చేసుకుంది.
అయితే.. దీనికి సంబంధించి సమీకరించాలని భావిస్తున్న భూముల విషయంలో సర్కారుకు అడ్డంకులు వస్తున్నాయి. రైతులు భూములు ఇచ్చేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి ఫ్లాట్లు ఇవ్వలేదని.. కమర్షియల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకు ఇవ్వలేదని .. రైతులు చెబుతున్నారు. అదేవిధంగా చాలా మంది పాత రైతులకు కౌలు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. దీనికి చంద్రబాబు తనదైన శైలిలో మార్గం చూపిస్తానని వారికి నచ్చ జెబుతున్నారు.
కాగా.. ఇప్పుడు మరో సంచలన వ్యవహారం తెరమీదికి వచ్చింది. రైతులను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని.. తాజా ల్యాండ్ పూలింగు విషయంలో రైతులను ఆందోళన పరుస్తున్నారని సర్కారుకు సమాచారం అందింది. అంతేకాదు.. మళ్లీ వైసీపీ వస్తే.. అప్పుడు రాజదానిని నిలిపి వేస్తామని కూడా వారు చెబుతున్నట్టు సీఎం చంద్రబాబు చెవిలో పడింది. దీంతో శనివారం ఉదయం హుటాహుటిన అధికారులను అక్కడకు పంపించిన చంద్రబాబు అసలు ఏం జరుగుతోందో రైతుల నుంచి వివరాలు సేకరించాలని సూచించారు. దీనిని బట్టి తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినట్టు తెలిసింది.