ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినపుడు దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించారో తెలిసిందే. 2019లో అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేయడానికి ఆయన చేయాల్సిందంతా చేశారు. వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా.. వాళ్లంతా ఏళ్ల తరబడి పోరాడినా పట్టించుకోలేదు. చివరికి 2024 ఎన్నికల్లో జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి అమరావతి అంశమే ఓ ప్రధాన కారణంగా మారింది. అయినా జగన్‌లో రవ్వంత కూడా మార్పు రాలేదన్నది స్పష్టం. ఈ మధ్య కూడా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. 500 ఎకరాల్లో రాజధాని కట్టేయొచ్చంటూ వ్యాఖ్యానించడం జగన్‌కు అమరావతి పట్ల ఎలాంటి ఆలోచనలున్నాయో చెప్పడానికి నిదర్శనం.
ఇక జగన్‌కు చెందిన సాక్షి మీడియా ప్రతి రోజూ అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉంటుంది. పునాదుల కోసం తవ్విన చోట నీళ్లు వస్తే అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేయడం సాక్షికే చెల్లింది. ఐతే ఇప్పుడు అమరావతి మీద సాక్షి మీడియా విష ప్రచారం తర్వాతి స్థాయికి చేరుకుంది. సాక్షి టీవీ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో రెగ్యులర్‌గా పాల్గొనే కృష్ణంరాజు అనేే రాజకీయ విశ్లేషకుడు అమరావతిని ‘వేశ్యల రాజధాని’ అని వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన వైసీపీ మద్దతుదారు అన్నది బహిరంగ రహస్యం. ఆయన అమరావతిని దేవతల రాజధాని అని కూటమి ప్రభుత్వం పేర్కొనడం అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేవతలు అంటే హిందూ దేవతలా, క్రిస్టియన్ దేవతలా, ముస్లిం దేవతలా అని వెటాకారాలాడిన కృష్ణం రాజు.. అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ అని వార్తలు వచ్చాయని.. ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులు కూడా ఎక్కువే అని.. అందుకే అమరావతిని వేశ్యల రాజధాని అనాల్సి ఉంటుందని.. దాన్ని దేవతల రాజధాని అని ఎలా అంటారని కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇలా మాట్లాడొద్దు అని ముందు వారించిన న్యూస్ ప్రెజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావు.. అమరావతిలో సెక్స్ వర్కర్లు ఎక్కువమంది ఉన్నట్లు వచ్చిన వార్తలను తాను కూడా చూశానంటూ వంత పాడడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న టీడీపీ, జనసేన మద్దతుదారులు.. అమరావతి మీద ఇంకెంత కాలం విషం చిమ్ముతారంటూ జగన్ అండ్ కో మీద మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు సాక్షి మీడియా తరఫున జగన్, భారతి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.