-->

ఏపీకి తెలంగాణ డిప్యూటీ సీఎం.. మ్యాటరేంటి?

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి సత్సంబంఠధాలే కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రతిపాదిస్తున్న బానకచర్ల ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య రచ్చ రాజుకుంటోంది. నదుల అనుసంధానంలో బానకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకమైదని, దీనితో ఏపీలో నదుల అనుసంధానం దాదాపుగా పూర్తి అయినట్టేనని, అంతేకాకుండా రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే తమ అనుమతి లేకుండా బానకచర్లను ఎలా కడతారంటూ తెలంగాణ ఇప్పుడిప్పుడే గళం విప్పుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శనివారం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏపీ పర్యటనకు వెళుతున్నారు.

ఏపీలో భట్టి పర్యటన శుక్రవారమే ఖరారు కాగా… ఈ టూర్ లో భట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తామరట. కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని పిన్నాపురంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును కడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకే భట్టి ఏపీ పర్యటనకు వెళుతున్నారని అదికారిక సమాచారం. వాస్తవానికి గ్రీన్ ఎనర్జీలో ఏపీ దేశానికి కేంద్రంగా మారబోతోంది. గ్రీన్ కో కంపెనీ ఇప్పటికే పిన్నాపురంలో తన ప్రాజెక్టును చివరి దశకు తీసుకుని రాగా… మరిన్ని కంపెనీలూ కర్నూలు జిల్లాలోనే మరిన్ని ప్రాజెక్టులు కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలోనూ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం చూస్తున్న కాంగ్రెస్ సర్కారు… ఓ సారి ఏపీలోని ప్రాజెక్టును పరిశీలించాలని భావించినట్లు సమాచారం. ఈ బాధ్యతలు భట్టి తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… ఏపీ ప్రతిపాదిస్తున్న, తెలంగాణ వ్యతిరేకిస్తున్న బానకచర్ల ప్రాజెక్టు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోనే ఉంది. అంతేకాదండోయ్.. భట్టి పరిశీలించనున్న పిన్నాపురం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు బానకచర్ల ప్రాజెక్టు కేవలం ఓ 20 నుంచి 30 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతానికి ఈ బానకచర్ల రెగ్యులేటర్ నుంచే కృష్ణా జలాలు ఇటు తెలుగు గంగకు, అటు కేసీ కెనాల్ కు, ఆపై ఎస్సార్ఎంసీకి విడిపోతాయి. ఈ లెక్కన తెలంగాణ గతంలో ఓ రేంజిలో వ్యతిరేకించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కంటే కూడా బానకచర్ల రెగ్యులేరటే కీలకమైదిగా నిలుస్తోంది,.

ఏపీ పర్యటనకు వెళుతున్న భట్టి విక్రమార్క తాను ముందుగా నిర్దేశించుకున్నట్లుగా పిన్నాపురం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును మాత్రమే పరిశీలించి వెనుదిరుగుతారా? లేదంటే..ఇక్కడికి దగ్గరే కదా బానకచర్లను కూడా ఓ సారి చూసి వద్దామంటారా? అన్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అదే జరిగితే… భట్టికి ఏపీ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తలు పెరిగిపోతాయి. ఓ సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తగా ఈ తరహా అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న భట్టి విక్రమార్క బానకచర్ల జోలికి వెళ్లకుండా పిన్నాపురం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పరిశీలనకే పరిమితమవుతారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.