వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం(రెడ్డి) కుమార్తె క్రాంతి తాజాగా సంచలన పోస్టు పెట్టారు. తన తండ్రి పద్మనాభం కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారని తెలిపారు. ఈ విషయం తనకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారా తెలిసిందన్నారు. దీంతో ఆయన తనను వెంట బెట్టుకుని తన తండ్రిని చూసేందుకు తీసుకువెళ్లారని క్రాంతి పేర్కొన్నారు. కానీ, అక్కడ తన సోదరుడు గిరి అడ్డుకున్నట్టు వెల్లడించారు.
“నా సోదరుడు గిరి.. నా తండ్రిని చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. కనీసం ఆయనకు సరైన వైద్యం కూడా చేయించడం లేదు. చాలా రహస్యంగా ఉంచుతున్నారు. కొందరు మాత్రమే ఆయన వద్ద ఉన్నట్టు సమాచారం. కానీ.. మా నాన్నకు అత్యంత ఆప్తులు.. కావాల్సిన వారు.. నేను కూడా ఆయనను చూసేందుకు ప్రయత్నించాం. కానీ.. గిరి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. రేపు మా నాన్నకు (ముద్రగడ పద్మనాభం) ఏమైనా జరిగితే.. ఏంటి? “ అని క్రాంతి తన పోస్టులో ప్రశ్నించారు.
రేపు గిరిని వదిలి పెట్టేది లేదన్నారు. కనీసం ఇప్పుడు ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉందో కూడా చెప్పడం లేదని.. ఆయన ఆరోగ్యంపై తమకు తీవ్రమైన ఆందోళన ఉందని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు., ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బయటకు చెప్పకుండా ఉంచాలని అనుకున్నామని.. కానీ, బయటకు చెప్పాల్సి వస్తోందని.. దీనికి కారణం.. గిరేనని ఆమె పేర్కొన్నారు. రేపు ముద్రగడకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత గిరి వహించాల్సి ఉంటుందని.. తాను వదిలి పెట్టబోనని అన్నారు.
ఇదిలావుంటే.. గత ఎన్నికలకు ముందు.. క్రాంతి.. జనసేనకు అనుకూలంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అదే ఎన్నికల సమయంలో ఆమె పార్టీలోనూ చేరారు. ఇక, ఆమె తండ్రి ముద్రగడపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. నేరస్తులతో చేతులు కలుపుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక, ఈ క్రమంలోనే తండ్రి, కుమార్తెల మధ్య తీవ్ర వాగ్యుద్ధం కూడా జరిగింది. దీంతో అసలు తన కుమార్తె తన ఆస్తి కాదని.. అప్పట్లో ముద్రగడ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.