-->

కొత్త నిర్ణ‌యం: ఏపీలో `షైనింగ్ స్టార్‌` అవార్డులు..

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌గా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థుల‌ను అన్ని విధాలా ప్రోత్స హించేందుకు న‌డుం బిగించింది. కొత్త‌గా `షైనింగ్ స్టార్‌` అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వీటిని 10, ఇంట‌ర్ చ‌ద‌వి విద్యార్థుల‌కు ఇవ్వాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. ముఖ్యంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయ‌డంతోపాటు.. విద్యార్థుల‌ను ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.

గ‌త విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి విద్యార్థులు సాధించిన మార్కుల‌ను బ‌ట్టి ఈ అవార్డుల‌ను ఇవ్వ‌నున్నారు. అంటే.. 2024-25 విద్యాసంవ‌త్స‌రం నుంచే `షైనింగ్ స్టార్‌` అవార్డుల‌ను ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల‌కు ఈ అవార్డులు ఇస్తారు. అవార్డు కింద‌.. మెమొంటో స‌హా 20 వేల రూపాయ‌ల న‌గ‌దును కూడా విద్యార్థుల‌కు అందిస్తారు. త‌ద్వారా వారి ఉన్న‌త చ‌దువుల‌కు ప్ర‌భుత్వం ప్రోత్స‌హించ‌నుంది.

ఎలా ఎంపిక చేస్తారు?

+ పదో తరగతిలో 500 పైన మార్కులు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు.

+ అన్ని సామాజిక వ‌ర్గాల్లోని విద్యార్థుల‌ను ఈ అవార్డుల‌కు అర్హులుగా పేర్కొన్నారు.

+  మండలాల వారీగా ప్ర‌తిభ గ‌ల విద్యార్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

+ ఒక్కొక్క‌ మండలం నుంచి ఆరుగురు పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేస్తారు.

+ ఎంపిక చేసిన విద్యార్థుల్లో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులు ఉండేలా చూస్తారు.

+  అయితే, ఇంటర్ విద్యార్థులను మాత్రం.. ప్రతి జిల్లాకు 36 మంది చొప్పున ఎంపిక చేస్తారు.