పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలే: జనసేన

ఏపీలో అధికార కూటమిలో కీలక బాగస్వామి అయిన జనసేన తన శ్రేణులకు ఓ హెచ్చరికతో కూడిన సూచనను చేసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ లైన్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కూడా ఆ పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎంకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేరిట శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలో తరచూ జరుగుతున్న పొరపాట్లను పార్టీ ఎత్తి చూపుతూ సలహాలు, సూచనలు చేసింది.

జనసేనకు సంబంధించిన పాలసీపైనా.. జాతీయ, రాష్ట్ర అంశాలపై పార్టీ అనుసరిస్తున్న విధానాలు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి…పార్టీ వ్యూహాల గురించి పార్టీ అధినేత హోదాలో పవన్ కల్యాణ్ పలు సభలు, సమావేశాల్లో  ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉన్నారని ఈ సందర్బంగా హరిప్రసాద్ గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై పార్టీ లైన్ ఇదంటూ చెబుతున్నా… ఇప్పటికీ అక్కడక్కడ కొందరు పార్టీ నేతలు పార్టీ లైన్ ను విస్మరించి మరీ మాట్లాడుతున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ తరహా వ్యాఖ్యలు ఇటు ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ అయోమయానికి కారణంగా నిలుస్తున్నాయని తెలిపారు. 

పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీప్పవని జనసేన సదరు ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. నిజమే మరి… పార్టీ ఆవిర్బవించి పదేళ్లు దాటినా… ప్రజా క్షేత్రంలోకి దిగింది మాత్రం ఆరేళ్ల క్రితమే కదా. ఈ లెక్కన ఆరేళ్ల వయసు కలిగిన పార్టీకి చెందిన శ్రేణుల్లో అంతగా పరిణతి ఉండదనే చెప్పాలి. ఈ భావనతోనే పవన్ కల్యాణ్ ఎప్పికటికప్పుడు పార్టీ విధి విధానాలపై పార్టీ శ్రేణులకు తెలియజేస్తూనే ఉంటారు. ఏ విషయంపై ఎలా వెళితే ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందన్న విషయంపైనా ఆయన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ ఉంటారు. అదే విషయాన్ని ఇప్పుడు నేరుగా మరోమారు ప్రకటన రూపంలో జనసేన తన శ్రేణులకు హెచ్చరికల రూపంలో జారీ చేసింది.