వైసీపీ అధినేతగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో నాయకుల మధ్య చిత్రమైన చర్చ సాగుతోంది. “ఈ సలహాలు ఇస్తోందెవరు? జగన్‌ను నడిపిస్తోందెవరు? “ అని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గత వారంలో రెండు కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. అయితే.. రెండు కార్యక్రమాలు కూడా.. పార్టీకి ప్లస్ కాకపోగా.. మైనస్ అయ్యాయి. పైగా.. వ్యతిరేకత మరింత పెరిగేలా కూడా చేశాయి. ఈ వ్యవహారమే పార్టీలో చర్చకు దారితీసింది.
అంతేకాదు.. అసలు ఈ సలహాలు ఇస్తోందెవరని కూడా ఆరా తీస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు కూడా.. ఇలాంటి సలహాలే కొంపముంచాయన్న భావన పార్టీ నాయకుల్లో ఉంది. నియోజకవర్గాల్లో మార్పుల నుంచి పార్టీ నుంచి నాయకులు పోయినా.. వారిని కనీసం చర్చించకపోవడం.. పార్టీ పరంగా వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని నాయకులు ప్రశ్నించారు.అయినా.. పార్టీలో ఎలాంటి మార్పులూ రాలేదు.
ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా అసెంబ్లీకి వెళ్లబోమని భీష్మించడంపై ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. కానీ. ఎవరూ కూడా బయటకు చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి సంబంధించి కూడా.. ఎవరికీ చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారని.. నాయకులు చెవులుకొరుక్కుంటున్నారు. ఇది సరికాదని.. మనం వరద ప్రభావిత ప్రాంతమైన విజయవాడలో కూడా బాధితులను ఇప్పటి వరకు పరామర్శించలేదని.. కొందరు గుర్తు చేస్తున్నారు.
రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించకుండా.. నేరుగా న్యాయపోరాటానికి దిగి ఉంటే బాగుండేదని చాలా మంది నాయకులు చెబుతున్నారు. “ఇక్కడ వ్యక్తులు కాదు.. వ్యవస్థను మేం టార్గెట్ చేసి ఉంటే బాగుండేది“ అని అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ.. ఈ విషయంలో ఎవరు సలహా ఇచ్చారో.. అని ఆయన తలపట్టుకున్నారు. ఇక, వెన్నుపోటు దినంపైనా.. ఇదే తరహా చర్చ సాగుతోంది. ఇక పై అయినా.. అదినేత నిర్ణయం తీసుకునేముందు.. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. మరి ఇది జరుగుతుందా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్న.