-->

నాడు ‘లడ్డూ’ తయారీకి వాడింది నెయ్యే కాదట!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా ఓ మంచి గుర్తింపు ఉంది. తిరుమల లడ్డూకు ఉన్న రుచి మరే లడ్డూకు రాదు. రాబోదు కూడా. భక్త కోటి మహా ప్రసాదంగా పరిగణించే వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీకి ఎంపిక చేసిన విక్రయదారుల నుంచే దినుసులను టీటీడీ కొనుగోలు చేస్తుంది. 2019 దాకా అంతా బాగానే జరిగినా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పుణ్యమా అని తిరుమల లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యి కాకుండా కల్తీ నెయ్యిని వాడారు. ఇది నిన్నటిదాకా ఆరోపణే. నేడు అది నిజం. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం ఏపీ హైకోర్టుకు ఇదే విషయాన్ని వెల్లడించింది.

కూటమి సర్కారు అధికారంలోకి రాగానే.. టీటీడీలో అప్పటిదాకా జరిగిన పలు అక్రమాలు బయటకు రాగా… తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణ కలకలం రేపింది. దీనిపై రాజకీయ పరంగానే ఓ రేంజిలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. అంతిమంగా సుప్రీంకోర్టుకు ఈ విషయం చేరగా.. తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ, ఏపీ పోలీస్, ఫోరెన్సిక్ నిఫుణులను నియమించింది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు తమకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేయగా… సిట్ కౌంటర్ దాఖలు చేసింది,. ఈ కౌంటర్ లోనే తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని… అసలు అది నెయ్యే కాదని కూడా సిట్ తేల్చి చెప్పింది.

వాస్తవానికి బోలేబాబా డెయిరీ గతంలో తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును పొందింది. అయితే ఆ సంస్థ చేసిన కొన్ని జిమ్మిక్కులను గుర్తించిన టీటీడీ దానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇక వైసీపీ హయాంలో ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలు నెయ్యి సరఫరా కాంట్రాక్టును పొందగా… వైసీపీ నేతల వత్తాసుతో బోలేబాబా డెయిరీ మళ్లీ తన చక్రాన్ని తిప్పింది. పామాయిల్, ఇతర రసాయనాలతో కల్తీ నెయ్యిని తయారు చేసి దానిని ఏఆర్, వైష్ణవి డెయిరీల ద్వారా తిరుమలకు సరఫరా చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ ఈ వ్యవహారం గుట్టుగా సాగింది. బోలేబాబా డెయిరీకి జీహుజూర్ అన్న వైసీపీ నేతల మద్దతుతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోయింది.

అయితే 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడంతో బోలేబాబా డెయిరీ అక్రమాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కూటమి సర్కారు సీరియస్ గా తీసుకుంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే తిరుమల ఆయల మెట్లను కడిగి మరీ తనదైన శైలి నిరసనను తెలిపారు. వెరసి ఈ వ్యవహారం దేశవ్యాప్త సమస్యగా మారిపోయింది. ఎక్కడికక్కడ తిరుమల లడ్డూ తయారీ గురించే చర్చ సాగింది. చివరాఖరుకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు చేరగా.. సిట్ ఏర్పాటు, కల్తీ నెయ్యి వ్యవహారం ఆరోపణ కాదు నిజం అని తేలిపోయింది. ఇక నిందితులంతా పలుకుబడి కలిగిన వారని, వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.