కూట‌మి ఏడాది పాల‌న‌.. 17 మంది ఖైదీల‌కు విముక్తి!

ప‌లు సంద‌ర్భాల‌ను పుర‌స్క‌రించుకుని జైల్లో ఉన్న ఖైదీల‌కు ప్ర‌భుత్వాలు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించ‌డం ఆన‌వాయితీ. జ‌న‌వ‌రి 26, ఆగ‌స్టు 15, అక్టోబ‌రు వంటి కీల‌క దినాల్లో మంచి ప్ర‌వ‌ర్త‌న‌, మంచి న‌డ‌వ‌డిక గ‌ల ఖైదీల‌ను జైలు నుంచి విడుద‌ల చేస్తారు. ఇది కొన్నిద‌శాబ్దాలుగా వ‌స్తున్న ఆన‌వాయితీ. అయితే.. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో.. ఈ పాల‌న‌పై ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని భావిస్తున్న స‌ర్కారు.. మంచి ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది.

కూట‌మి పాల‌న‌పై ప్ర‌జ‌ల సంతోషానికి ప్ర‌తీక‌గా.. జీవిత ఖైదు ప‌డిన వారిని విడుద‌ల చేయాల‌ని తాజాగా నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌కు మంత్రులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం.. జీవిత ఖైదు ప‌డిన 17 మంది ఖైదీల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. వీరిలో మ‌హిళా ఖైదీల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోవైపు .. పెట్టుబ‌డులు పెట్టే సంస్థ‌ల‌కు కేటాయించిన భూముల‌ను స‌త్వ‌ర‌మే ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. అదేవిధంగా వారికి ఇస్తామ‌ని ప్రామిస్ చేసిన రాయితీలు(స‌బ్సిడీ) ఇవ్వ‌నున్నారు. రాష్ట్రంలోని 248 కానిస్టేబుళ్ల‌కు హెడ్ కానిస్టేబుళ్లుగా.. ఏ ఎస్సైలుగా కూడా ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. వారి స‌ర్వీసు ఆధారంగా ఇది చేయ‌నున్నారు.

ఐటీ స‌హా.. ఇత‌ర రంగాల్లో ప‌నిచేసే మ‌హిళ‌ల‌కు.. రాత్రి పూట కూడా ప‌నిచేసుకునేలా స్వేచ్ఛ‌నిస్తూ.. కేబినెట్ తీర్మానం చేసింది. దీని ప్ర‌కారం.. మ‌హిళ‌లు రాత్రిపూట కూడా విధులు నిర్వ‌హించుకునే అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా వారికి త‌గిన భ‌ద్ర‌త‌, ర‌వాణా సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పించాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. త‌ద్వారా మ‌హిళ‌ల శ్రామిక శ‌క్తికి స‌పోర్టు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని మంత్రి వ‌ర్గం భావిస్తోంది. ఇక‌, ఇటీవ‌ల వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ క‌డ‌ప జిల్లాగా మారుస్తూ.. తీసుకున్న నిర్ణ‌యాన్ని కూడా.. కేబినెట్ ఆమోదించింది. దీనిపై గెజిట్ జారీ చేయ‌నున్నారు. పోలీసు అకాడ‌మీకి మ‌రో 95 ఎక‌రాల‌ను ఇచ్చేందుకు మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.