వైసీపీ అధినేత జగన్.. తీరు ఏమాత్రం మారడం లేదన్న వాదన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. నిరసనలకు, ధర్నాలకు ఆయన పిలుపునిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలను కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నారు. షరుతులు పెడుతున్నారు. ఒత్తిడి కూడా తెస్తున్నారు.దీంతో నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నారు. కానీ, ఇదేసమయంలో జగన్ మాత్రం ఎస్కేప్ అవుతున్నారు. ఆయా నిరసనలకు, ధర్నాలకు మాత్రం జగన్ ఎక్కడా కనిపించడం లేదు. మరి దీనిని పార్టీ నాయకులు తప్పుబట్టకుండా ఉంటారా? అంటే.. ఖచ్చితంగా తప్పుబడుతున్నారు.
తాజాగా వెన్నుపోటు కార్యక్రమంలో తమకే తమ నాయకుడు వెన్నుపోటు పొడిచాడంటూ.. కొందరు నాయకులు ఆఫ్‌దిరికార్డు గా వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. గత నెల 20నే జగన్.. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ సమయంలోనే ఆయన తాను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తానని.. ఏడాది అయిపోయిన నేపథ్యంలో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో తూ.చ. తప్పకుండా పాల్గొనాలని కూడా జగన్ సూచించారు. దీంతో ఆరోగ్యం సహకరించకపోయినా.. అనారోగ్యంగా ఉన్నా కూడా.. నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొని అస్వస్థతకు గురయ్యారు. మరి ఇచ్చిన మాట ప్రకారం.. కార్యకర్తలకు చేసిన వాగ్దానం ప్రకారమైనా.. జగన్ వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. కానీ, అసలు ఆయన ఎక్కడా కనిపించలేదు. కనీసం తాడేపల్లిలోని ఇంట్లో కూర్చుని అయినా.. పర్యవేక్షించారా? అంటే అది కూడా లేదు. నేరుగా ఆయన తన సతీమణితో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయారు. అంతేకాదు.. పార్టీ నాయకులకు కూడా కొద్ది మందికే ఈ సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ జగన్ తాడేపల్లిలోనే ఉన్నారని అనుకున్నారు.
ఇక, మాజీ సలహాదారు, ప్రస్తుతం రాష్ట్ర వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎక్కడా బయటకు రాకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నివ్వెర పోయారు. ఈ పరిణామంపై పార్టీలోనూ చర్చ వచ్చింది. వెన్ను పోటు కార్యక్రమం వైసీపీ నాయకుల కోసమే తీసుకువచ్చారా? అని పలువురు ప్రశ్నించడం గమనార్హం. మరికొందరు.. పార్టీ విధానాన్ని ఎండగట్టారు. గతంలోనూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటు విషయంపై చేపట్టిన నిరసనకూడా పెద్దగా ఫలించక పోవడం గమనార్హం. ఈ విషయంపైనా నాయకులు చర్చించారు. పార్టీ అధినేత ముందుకు రాకుండా ఇలా తప్పించుకుంటే కార్యక్రమాలు ఎలా సక్సెస్ అవుతాయన్న ప్రశ్నలు కూడా తెరమీదికి వచ్చాయి.