వైసీపీ ఒకటి అంటే.. కూటమి నాలుగు వాయించేస్తోంది. వైసీపీ నుంచి ఒక్కరు బయటకు వస్తే.. కూటమి పార్టీల నుంచి బలమైన నాయకులు నలుగురు వస్తున్నారు. వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే రాజకీయం. వైసీపీ ఏడాది పాటు మౌనంగా ఉండి.. తర్వాత.. చేపట్టిన కార్యక్రమం వెన్నుపోటు దినం. అయితే.. దీనికి పోటీగా కూటమి కూడా పలు కార్యక్రమాలు చేపట్టింది. పీడ విరగడైందని.. పేర్కొంటూ.. జనసేన నాయకులు రోడ్డెక్కారు.
ఇక, సమతా పాలన.. సుదినం.. అంటూ.. టీడీపీ నాయకులు వీధులెక్కి కార్యక్రమాలు చేశారు. అటు నుంచి ఇద్దరు మాట్లాడితే.. ఇటు నుంచి నలుగురుకాదు.. నలభై మంది అన్నట్టుగా నాయకులు మైకు పుచ్చుకున్నారు. అంతేకాదు.. వైసీపీ లోపాలను ఎండగట్టే పత్రికలు, మీడియా కూడా.. భారీగానే విజృంభించింది. అదేసమయంలో పాజిటివిటీ కంటే కూడా.. వ్యతిరేకతను పెంచే వారు కూడా పెరుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి ఛాన్స్ చిక్కడం లేదన్న చర్చ జోరుగానే సాగుతోంది.
ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికిప్పుడు చేయాల్సింది ఏంటి? ఎలా ముందుకు సాగాలన్న విషయంపై ఆ పార్టీలోనే చర్చ వస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం అలా ఉంచితే.. బల మైన గళాలను వెతికి పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతున్న మాట. అదేసమయంలో కౌంటర్ ఎటాక్ చేయగల సైన్యాన్ని వైసీపీ సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ఎప్పటి కప్పుడు జగన్ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ఇక, ప్రజలకు వైసీపీ వాయిస్ చేరే సమయం కంటే ముందే.. కూటమి అలెర్ట్ అవుతోంది. ఇది రాజకీయం. దీనిని ఎవరూ కాదనరు. కానీ.. దీనికి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం నాయకులకు ఉంది. భవిష్యత్తులో ఒక క్యాలెండర్ పెట్టుకుంటారో.. నాయకులను తయారు చేసుకుంటారో.. వైసీపీ ఇష్టం. కానీ.. బలమైన వాయిస్ వినిపించేవారు.. దూకుడుగా కౌంటర్లు ఇచ్చేవారు లేకపోతే.. పక్కాగా పార్టీకి నష్టమనే భావన సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.