బాబు మార్కు!… ఇకపై ‘సీడ్ రాఖీ’లదే ట్రెండ్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అంతా విజనరీ అని అంటూ ఉంటారు గానీ… బాబు విజనరీ మాత్రమే కాదు ట్రెండ్ సెట్టర్ కూడా. ఏ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తనదైన శైలి సూచనలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బాబు నోట ఓ కొత్త మాట వినిపించింది. అదే సీడ్ రాఖీ. దేశంలో 2018లోనే సీడ్ రాఖీ మాట వినిపించినా ఇప్పటికీ అది దేశవ్యాప్తంగా విస్తరించలేదనే చెప్పాలి. మెజారిటీ జనం ఇప్పటిదాకా ఈ పేరే వినలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు బాబు చలవతో ఇకపై చాలా ఏళ్ల పాటు సీడ్ రాఖీ ఓ ట్రెండ్ మారే అవకాశాలు లేకపోలేదు.

అసలు ఈ సీడ్ రాఖీ అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే… ఇప్పటిదాకా ఏదో ప్లాస్టిక్, ఇతరత్రా వస్తువులతో చేసిన రాఖీలను మనం చూశాం. వీటినే రక్షా బంధన్ నాడు అన్నాతమ్ముళ్లకు… అక్కాచెల్లెళ్లు కడుతున్నారు. సైజులు, రూపాలను బట్టి ఏటికేడు కొత్త రాఖీలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా పర్యావరణానికి హానీ చేసేవే. ఎందుకంటే ఇవన్నీ వేస్టేజీ కింద డంప్ యార్డులకు చేరతాయి. వెరసి ఇవన్నీ చెత్తగా మారిపోతాయన్న మాట. అయితే ఇతరత్రా వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం కంటే ఇవి ఒకింత చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం పట్టించుకోవడం లేదు.

అదే సీడ్ రాఖీ అయితే అక్కాచెల్లెళ్లు కట్టే రాఖీలను ఆ తర్వాత అన్నాతమ్ముళ్లు… భూమిలో పాతి పెడతారు. అందులో ఉండే వస్తువులన్నీ భూమిలో కరిగిపోతాయి. దానిపై ఉండే విత్తనం మొలకెత్తి మొక్కగా, ఆపై మహావృక్షంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అంటే సీడ్ రాఖీలో వేస్టేజీ అనే మాటే ఉండదన్న మాట. ఇలాంటి రాఖీలతో పర్యావరణానికి మంచి లాభం చేకూరుతుంది తప్పించి ఇసుమంత నష్టం కూడా ఉండదు. పనిలో పనిగా ఒక్కో రాఖీ ఒక్కో వృక్షంగా మారిపోతూ ఉండటంతో పచ్చదనం కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.

గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే చంద్రబాబు నోట సీడ్ రాఖీ మాట వినిపించింది. కొన్ని సీడ్ రాఖీలను కూడా అక్కడికి తెప్పించిన బాబు..  వాటిని జనానికి చూపిస్తూ ఇకపై మీ సోదరులకు సీడ్ రాఖీలే కట్టండి అంటూ మహిళా లోకానికి పిలుపునిచ్చారు. ఫలితంగా జరిగే ప్రయోజనాల గురించి కూడా బాబు వివరించారు. మీ సోదరుల జన్మ నక్షత్రాలను తెలుసుకుని, ఆ నక్షత్రంతో జోడి కట్టే చెట్టు విత్తనాలతో తయారయ్యే రాఖీలను వాడండని ఆయన పిలుపునిచ్చారు. జన్మ నక్షత్రంతో కూడిన సీడ్ రాఖీలతో మీ సోదరులకు మంచి జరగడమే కాకుండా సమాజానికి కూడా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు.