వైసీపీ అధినేత జగన్‌కు ముందున్నది ముళ్లదారే. ఈ విషయంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. ఆయన అనుకున్నట్టుగానో.. ఆయన ఊహించుకుంటున్నట్టుగానో.. ఏదీ సానుకూలంగా జరుగుతుందని భావించే పరిస్థితి ఇప్పుడు లేదు. తాజాగా చేపట్టిన `వెన్నుపోటు దినం` దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే.. ఆయన అనుకున్న విధంగా అయితే.. ఈ నిరసన సాగలేదు. పైగా గతంలో వైసీపీ పాలనలో పదవులు పొందినవారే.. ఇప్పుడు తీవ్ర విమర్శలతో చెలరేగిపోయారు. జగన్ నేరచరిత్ర ఇదీ అంటూ.. మాటలతో యుద్ధం ప్రకటించారు.
వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే నిరసనలకు.. మంచి ఫలితాలు ఆశించడం పార్టీలకు తప్పుకాదు. అయితే.. ఈ విష యంలో ఆచి తూచి అడుగులు వేయాలి. సమయం, సందర్భం కూడా చూసుకోవాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏమీ అమలు చేయడం లేదనే అనుకున్నా.. ప్రజల్లో ఇంకా అలాంటి ధోరణి కనిపించడం లేదు. “చంద్రబాబు ఉన్నారు.. చేస్తారు.. పవన్ కల్యా ణ్ ఉన్నాడు.. చేయిస్తాడు“ అనే ఆశ సజీవంగా ఉందన్న విషయం తరచుగా వినిపిస్తూనే ఉంది. పైగా.. కళ్ల ముందు కూటమి చేసిన రహదారుల బాగుచేత, పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ పరీక్షలు.. వంటివి కనిపిస్తున్నాయి. సో.. ఈ నేపథ్యాన్ని జగన్ ఎక్కడో మిస్ అయ్యారు.
ప్రజల నాడినిపట్టుకుని వారికి అనుకూలంగా పనిచేసిన పార్టీనే ప్రజల మధ్య ఉంటుంది. ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఈ విషయంలో జగన్ పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న అంశాలను పట్టుకుని.. వాటిపై ఆయన పోరాటాలకు దిగితే..కొంతమేరకైనా సింపతీ దక్కి ఉండేది. కానీ, అలా చేయలేదు. ఏడాది అయింది.. సూపర్ సిక్స్ అమలు చేయలేదన్న ఏకైక వాదనను తెరమీదికి తీసుకువచ్చారు. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. సాధారణ ప్రజలు కూడా పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. ఎవరూ కలిసిరాలేదు. వైసీపీ నాయకులు చేసిన నిరసనలు రికార్డు కూడా చేరలేదు.
మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికల ఫలితం వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాయి. ఇదేసమయంలో వైసీపీని ఏకేశాయి. దీనికి కారణం.. జగన్ ఇచ్చిన పిలుపే. అంతేకాదు.. కూటమి బలంతో పోల్చి నప్పుడు వైసీపీ బలం ఇప్పుడు చాలా వరకు తక్కువగానే ఉంది. అటు మీడియా పరంగా.. ఇటు నాయకుల పరంగా కూడా.. వైసీపీకి ఎదురు దెబ్బలు ఇంకా మానలేదు. ఈ క్రమంలో జగన్ అలివిమీరిన చింతనతో చేపట్టే కార్యక్రమాలకు ఇకనైనా బ్రేకులు వేయాలి. ప్రజల ఆమోదం పొందేలా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే ఆయన చేపట్టే నిరసనలకు, ఆయనకు కూడా విలువ ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates