పీ-4కు సంబంధించి.. సీఎం చంద్రబాబు బుధవారం అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి కీలక లక్ష్యం కూడా నిర్దేశించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి 15 లక్షల కుటుంబాలను `మార్గదర్శులు` దత్తత తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు లక్ష్యాన్ని చేరుకునేందుకు పక్కా ప్రణాళికలు రెడీ చేసుకోవాలని పేర్కొన్నారు. పీ-4 కేవలం ప్రకటన కాదని.. ఇది ఎంతో ఉదాత్త ఆశయంతో నిర్వహిస్తున్న కార్యక్రమమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చాలా మంది పారిశ్రామిక వేత్తలు.. ఎన్నారైలు కూడా దత్తతకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
“పీ-4 అనేది.. రాష్ట్ర చరిత్ర గతిని మార్చేస్తుంది. పేదలను ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దేందుకు, పెద్ద ఎత్తున వారిని అభివృద్ది చేసేందుకు నిర్దేశించిన కార్యక్రమం. దీనిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఈ విషయంలో అధికారులు సొంతగానే కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆ సమయానికి 15 లక్షల మంది పేదలను ఉన్నత వర్గాలు దత్తత తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి.“ అని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు-భాగస్వామ్యం(పీ-4)ను ఎవరూ అశ్రద్ధగా చూడొద్దని పేర్కొన్నారు.
పీ-4 ద్వారా ఇప్పటి వరకు 70 వేల కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నట్టు చంద్రబాబు వివరించారు. అయితే.. ఇంకా మరింత మంది ముందుకు వచ్చేందుకు అవకాశం ఉందని.. దీనిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. రాజధాని అమరావతి కోసం రైతులను ఏవిధంగా ఒప్పించామో.. ఒకసారి వెనక్కి వెళ్లి పరిశీలించాలని పేర్కొన్నారు. నాడు రైతులను ఒప్పించినట్టుగానే నేడు పారిశ్రామిక వేత్తలను ఒప్పించి.. వచ్చే రెండు మాసాల్లో 15 లక్షల మంది పేదలను ధనిక వర్గాలు దత్తత తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మీరు కూడా తీసుకోవచ్చు!
ఈ సందర్భంగా కలెక్టర్లను ఉన్నత స్థాయి అధికారులను కూడా చంద్రబాబు పీ-4లో భాగం కావాలని సూచించారు. మీకు కుదిరితే.. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే.. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు దత్తత తీసుకున్నా.. రాష్ట్రంలో మెరుగైన విధంగా పేదలు జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు కూడా ఆలోచన చేయాలని సూచించారు. పైగా కలెక్టర్లు కూడా పేదలను దత్తత తీసుకుంటే.. మరింత మందికి మార్గదర్శకులుగా వుంటారని తెలిపారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకుని వారికి సహకరించాలని సూచించారు.