మరో వారంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. వీటికి సంబంధించి పక్కా ప్రణాళిక కూడా రూపొందించారు. ఈ నెల 12 నాటికి తల్లికి వందనం పేరుతో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా.. కేంద్రం ఈ నెల నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్రం కూడా అదే కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభించనుంది.
ఇక, బడి పిల్లలకు పుస్తకాలను కూడా ఈ నెల 12నాటికి అందించేందుకు సర్కారు సిద్ధమైంది. అంటే మొత్తంగా ప్రభుత్వం మరో వారం రోజుల్లోనే ఆయా పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ నాయకులు.. బుధవారం రోడ్డెక్కడం.. నానా యాగీ చేయడం ఏంటన్నది ప్రశ్న. ఈ విషయాన్ని ప్రభుత్వం తాలూకు పెద్దలు, కూటమి పార్టీల నాయకుల కంటేకూడా.. నెటిజన్లు, సాధారణ ప్రజులు ప్రశ్నిస్తున్నారు.
సహజంగా ఏ ప్రభుత్వానికైనా కీలకమైన పథకాలను అమలు చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఇక, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబుతున్న ఏపీని పైకి తీసుకువచ్చి.. కాయకల్ప చికిత్స చేసి.. లైన్‌లో పెట్టేందుకు సమయం సరిపోయిందని సర్కారు పెద్దలే చెబుతున్నారు. దీంతో కొన్ని కీలక పథకాలను ఆర్థిక భారం అనుకున్న పథకాలను వాయిదా వేసిన మాట నిజమేనని సీఎం చంద్రబాబు ఇటీవల మహానాడు వేదికగానే ప్రకటించారు.
ఈ క్రమంలో వైసీపీ కొంత ఆలోచనాత్మక విధానంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా కాకుండా.. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా వ్యవహరిస్తే.. ప్రయోజనం ఏంటన్నది సాధారణ ప్రజల ప్రశ్న. సమయం ఇవ్వకుండానే.. ప్రశ్నించడం సరికాదని, అయినా.. ఇప్పటికే పింఛన్లు పెంచారు, సిలిండర్లు ఇస్తున్నారు.. పెట్టుబడులు తెస్తున్నారని వారు అంటున్నారు. కాబట్టి.. వైసీపీ యాగీ చేయడం సరికాదన్న టాక్ సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.