=

‘జ‌గ‌న్ కోస‌మా జ‌నం కోస‌మా’ – వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు!

వైసీపీ అధినేత జ‌గన్ ఇచ్చిన పిలుపు మేర‌కు.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వైసీపీనాయ‌కులు రోడ్డెక్కారు. కూట‌మి పార్టీలు.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం లేద‌న్న సాకుతో `వెన్నుపోటు దినం` పేరిట నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. చాలా జిల్లాల్లో ఈ ఊసు క‌నిపించ‌డంలేదు. మ‌రో వైపు కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం నాయ‌కులు రోడ్డెక్కారు. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణ‌జిల్లాలో  మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పేర్ని నాని.. అక్క‌డ మానేశారు.

ఎక్క‌డో దూరంగా ఉన్న గ‌న్న‌వరం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌న్న‌వరంలో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. దీంతో పార్టీలో ఊపు తెచ్చేందుకు ఆయ‌న ఈ కార్య‌క్ర‌మాన్ని వినియోగించుకున్నార‌న్న వాద‌న సొంత పార్టీ నాయ‌కుల్లోనే వినిపిస్తోంది. ఇక‌, క‌ప‌డ‌లో ఎంపీ అవినాష్ రెడ్డి రోడ్డెక్కారు. అయితే.. ఆయ‌న కూడా ప‌ట్టుమ‌ని 10 నిమిషాల్లోనే హ‌డావుడిగా కార్య‌క్ర‌మంలో పాల్గొని.. నాలుగు విమ‌ర్శ‌లు చేసి త‌ప్పించుకున్నారు.

విశాఖ‌లో ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణ్ మీడియాముందుకు వ‌చ్చారు. అదేవిధంగా పార్టీ నుంచి వెళ్లిపోవాల‌ని అనుకున్నట్టు ప్ర‌చారం వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కూడా పాల్గొన్నారు. కానీ, కీల‌క‌మైన గుడివాడ అమ‌ర్నాథ్ స‌హా.. ఇత‌ర నాయ‌కులు దూరంగా ఉండిపోయారు. విజ‌య‌వాడ‌లో దేవినేని అవినాష్ మిన‌హా.. ఇత‌ర నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌లేదు. గుంటూరులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. దీంతో వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వినిపించాయి.

జ‌గ‌న్ కోస‌మా?  జ‌నం కోస‌మా?  అంటూ.. నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం గ్రాఫ్ ప‌డిపోయిన స్థితిలో ఉన్న జ‌గ‌న్ కోస‌మే నాయ‌కులు తూతూ మంత్రంగా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని.. నిజంగానే ప్ర‌జ‌ల‌పై ఏమాత్రం కూడా వారికి ప్రేమ లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేవ‌లం 10 నిమిషాలు మాత్ర‌మే వారు బ‌య‌ట ఉన్నార‌ని.. కొంద‌రు ఎండ ఎక్కువ‌గా ఉంద‌ని.. సాయంత్రానికి వాయిదా వేసుకున్నార‌ని చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు కేవ‌లం పార్టీ గ‌డ‌ప మాత్ర‌మేదాటింద‌ని ప్ర‌జ‌ల‌కు చేర‌లేద‌ని చెబుతున్నారు.