రేషన్.. పేద కుటుంబాలకు ప్రభుత్వం సరఫరా చేసే నిత్యవసరాలు. ఇప్పటి వరకు పేదలకు అందించే ఈ సరుకుల విషయంపై సర్కారు తర్జన భర్జన పడుతోంది. దీనిని ఇచ్చే విషయంపై క్లారిటీ ఉన్నా.. వీటిని ప్రజలు వినియోగించుకునే విషయంలో మాత్రం తేడా కొడుతోంది. దీనిపైనే ఇప్పుడు సర్కారు కసరత్తు చేస్తోంది. తాజాగా రేషన్‌కు సొమ్ములు ఇస్తే బెటర్ అనే ఆలోచన చేస్తుండడం గమనార్హం. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం భారీధరలకే బియ్యాన్ని, ఇతర సరుకులను కొనుగోలు చేస్తోంది. అయితే.. ప్రజలు బియ్యాన్ని తినడం లేదు. నిజానికి ఎంత మంచి బియ్యం ఇచ్చినా.. `కోటా బియ్యం`గా ముద్ర పడిన దరిమిలా.. దీనిని తినేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోతోంది. దీనిని గమనించిన ప్రభుత్వం మార్పు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంది.
అయితే.. ఇక్కడే మరో విషయం చర్చకు వస్తోంది. పేదలకు ఇస్తున్న బియ్యంలో 30 శాతం మందికి పైగానే పేదలు వాటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు వారిని పూర్తిగా తగ్గించి.. కేవలం సొమ్ములు ఇస్తే.. సరిపోతుందా? అనేది ప్రశ్న. పైగా.. రేషన్ బియ్యం కొనసాగుతున్నందునే.. మార్కెట్‌లో సాధారణ బియ్యం ధరలు ఓ మాదిరిగా అయినా నిలకడగా ఉంటున్నాయి. అలా కాకుండా.. అందరూ బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడ్డారన్న సంకేతాలు వస్తే.. మాత్రం అప్పుడు బియ్యం మార్కెట్ను అదుపులో ఉంచడం దుస్సా ధ్యం అంటున్నారు పరిశీలకులు.
పైగా.. సర్కారు రూ.45 చొప్పున రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌నుంచి లేదా మిల్లర్ల నుంచి కొని.. పేదలకు పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రేషన్ వద్దనుకునే వారికి ఆ మొత్తాన్ని లెక్కగట్టి ఇస్తారా? అనేది సందేహం. ఎందుకంటే.. రూ.1కే ప్రస్తుతం ప్రజలు బియ్యాన్ని కొంటున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం రూ.45-48 మధ్య ఖర్చు చేస్తోంది. రేపు రేషన్ మానేసి డబ్బులు ఇవ్వాలని అనుకుంటే.. రూ.45 చొప్పున పేదలకు పంపిణీ చేస్తారా? లేక.. రూ.1 కిందే జమకట్టి.. ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. ప్రస్తుతం లెక్కలుమాత్రం సర్కారుకు కొరుకుడు పడడం లేదు.