=

కేసీఆర్‌ది గ‌ట్టి గుండె: క‌విత‌

మాజీ సీఎం కేసీఆర్ ది గ‌ట్టి గుండె అని.. అందుకే అంత పెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించార‌ని బీఆర్ ఎస్ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్యానించారు. కాళేశ్వ‌రంపై రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని ఆమె సూచించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డం వెనుక‌.. ఆయ‌న‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌న్న ఉద్దేశం ఉంద‌ని ఆరోపించారు. “సింహాన్ని చ‌ర్చ‌కు పిలుస్తారా?“ అని ఆమె స‌టైర్లు వేశారు. ఏం త‌ప్పు చేశార‌ని కేసీఆర్‌ను విచార‌ణ‌కు పిలుస్తార‌ని ప్ర‌శ్నించారు.

అన్ని త‌ప్పులు చేసిన వారు.. మౌనంగా ఉన్నార‌ని.. కానీ, ఏ తప్పూ చేయ‌ని వారిని మాత్రం విచార‌ణల పేరుతో వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని చెప్పారు. “తెలంగాణ‌ను తీసుకురావ‌డం వ‌ల్లే.. కొంద‌రు ప‌దవులు ద‌క్కించుకున్నారు. ఒకాయ‌న సీఎం అయ్యాడు. ఇది పైకి క‌నిపిస్తున్న వాస్త‌వం. ఇది తెచ్చింది కేసీఆర్ కాదా! అదేవిధంగా కాళేశ్వ‌రం క‌ట్ట‌డం వ‌ల్లే.. రైతుల‌కు ప్ర‌యోజనం చేకూరుతోంది. ఇది కూడా క‌నిపిస్తున్న వాస్త‌వం. కానీ, కొంద‌రు ఒప్పుకోవ‌డం లేదు. పైగా మేలు చేసిన నాయ‌కుడికి కీడు త‌ల‌పెడుతున్నారు. కేసీ ఆర్‌ది పెద్ద గుండె కాబ‌ట్టే.. ఆయ‌న ఇంత ప్రాజెక్టును భుజాన వేసుకున్నారు“ అని క‌విత వ్యాఖ్యానించారు.

“కేసీఆర్‌ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు. ఆయనకు నోటీసులు ఇచ్చారంటే అవి.. మొత్తం తెలంగాణ స‌మాజానికి ఇచ్చిన‌ట్టు కాదా? తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం, రైతుల‌కు మేలు చేయాల‌ని కోరుకోవడం.. కేసీఆర్‌ చేసిన తప్పా?“ అని క‌విత ప్ర‌శ్నించారు. ‘‘అది కాళేశ్వరం కమిషన్‌ కాదు.. అది కాంగ్రెస్‌ కమిషన్‌, రాజకీయ కమిషన్‌. ప్రాజెక్టు పూర్తి చేస్తే.. తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది.“ అని క‌విత వ్యాఖ్యానించారు.

క‌విత జెండా-అజెండా!

తాజాగా బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్కులో క‌విత నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ.. చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో ఎక్క‌డా బీఆర్ ఎస్ జెండా క‌నిపించ‌లేదు. అంతేకాదు.. బ‌ల‌మైన నాయ‌కులు కూడా తార‌స‌ప‌డ‌లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది క‌విత జెండా.. అజెండా ప్ర‌కార‌మే జ‌రిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా.. కేసీఆర్ కూడా ఈ నిర‌స‌న‌పై ఎక్క‌డా పెద‌వి విప్ప‌లేదు.  త‌న‌కు నోటీసులు ఇచ్చారు కాబ‌ట్టి.. నిర‌స‌న తెలపండి! అని ఎక్క‌డా చెప్ప‌లేదు. దీంతో సీనియ‌ర్లు ఎవ‌రూ ఈ ధ‌ర్నాకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.