బొత్సకు ఏమైంది?.. మాట్లాడుతూనే కుప్పకూలిన నేత

వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాటి పార్టీ నిరసనల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అయితే ఈ నిరసనల్లో ప్రసంగిస్తూనే ఆయన ఉన్నట్టుండి కుప్పకూలి పోయారు. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చేపట్టిన నిరసనలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స ప్రసంగిస్తున్న సమయంలోనే చేతిలో మైకు పట్టుకునే ఆయన అలా అలా కుప్పకూలారు. వేగంగా స్పందించిన పార్టీ నేతలు హుటాహుటీన ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బొత్స చాలా కాలంగా సతమతం అవుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్ విజయనగరం వెళ్లినప్పుడు కూడా బొత్స తీవ్ర అనారోగ్యంతోనే ఉన్నారు. చేతులు వణుకుతూ, కదలలేని పరిస్థితుల్లో ఉన్న బొత్సను ఎలాగోలా వేదిక మీదకు తీసుకు రాగా… జగన్ తో కలిసి ఆయన కనీసం చేయి పైకెత్తి కార్యకర్తలకు అభివాదం చేయలేకపోయారు. ఆ తర్వాత బొత్స వేగంగానే కోలుకున్నారు. తదనంతరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా బొత్సకు జగన్ అవకాశం కల్పించగా… సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి రాజకీయాల్లో  ఓ వెలుగు వెలిగిన బొత్స… పలు కీలక శాఖల మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. పాలనపై మంచి పట్టు కలిగిన నేతగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజకీయ వ్యూహాల్లో  బొత్స తలపండిన నేతగానే చెప్పాలి. విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించగలిగే స్థాయికి చేరిన బొత్స.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ కీలక నేతగా ఎదిగారు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ… పార్టీలు ఏవైనా కూడా బొత్స తనదైన రాజకీయ వ్యూహాలతో రాణిస్తూనే ఉన్నారు. 

ఇక బొత్సకు ఏమైందన్న విషయానికి వస్తే.. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే బొత్స అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తర్వాత బొత్స బాగానే ఉన్నారని, నిరసనలో కుప్పకూలిన దానికంటే ముందు ఎంత ఉత్సాహంగా ఉన్నారో… అంతే ఉత్సాహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బొత్స మాట్లాడుతూనే కుప్పకూలిన వీడియోతో పాటుగా…ఆసుపత్రిలో ఆయన చలాకీగా కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.