బాబు క‌ల‌ల ప్రాజెక్టు సాకార‌మ‌య్యేనా? రీజ‌నేంటంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. బ‌న‌క‌చ‌ర్ల‌. ఇది క‌ర్నూలులోని ఓ గ్రామం. ఇక్క‌డ భారీ ప్రాజెక్టును తీసుకురావ‌డం ద్వారా గోదావ‌రి న‌ది జ‌లాల‌ను వృధా కాకుండా.. ముఖ్యంగా స‌ముద్రంలో క‌ల‌వ‌కుండా.. ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చి.. ఆ నీటిని సీమ‌కు అందించ‌డం ద్వారా ఇక్క‌డి రైతుల‌కు.. సాగు, ప్ర‌జ‌ల‌కు తాగు నీరు అందించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీనిపై అధికారం చేప‌ట్టిన మ‌రుస‌టి రోజు నుంచి కూడా భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

సుమారు 80 వేల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేసిన ఈ బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర స్వ‌రూపం పూర్తిగా మారిపోతుంద‌ని కూడా.. సీఎం చంద్ర‌బాబు చెప్పారు. “ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌గా ఈ ప్రాజెక్టు మారుతుంది.“ అని గ‌తంలో సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాల‌ను(డీపీఆర్‌) కేంద్ర ప్ర‌భుత్వానికి అందించారు. ఇటీవ‌ల కేంద్రం కూడా.. దీనిపై చ‌ర్చించింది. అప్పుడు కూడా ఏపీ ప్ర‌భుత్వం మ‌రిన్ని వివ‌రాల‌ను అందించింది.

అయితే.. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ స‌ర్కారు స‌హా.. అక్క‌డి ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ అడ్డుప‌డుతోంది. దీనిని ఎలా ముందుకు సాగిస్తారో చూస్తామ‌ని.. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఈ అడ్డుకునే ప్ర‌య‌త్నాలు ఇప్పుడు మొద‌లైన‌వి కాదు.. చంద్ర‌బాబు ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. దీనిని స‌వాల్ చేస్తూ.. తెలంగాణ ప్ర‌భుత్వం ముందుగానే కేంద్రానికి లేఖ రాసింది. దీనివ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొంది.

స‌ముద్రంలోకి పోయే నీటి పేరిట ఏపీ క‌డుతున్న ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ‌కు నీరు అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని కూడా తెలంగాణ స‌ర్కారు వాద‌న‌లు వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా.. గ‌త రెండు మాసాల కింద‌టే స్వ‌యంగా కేంద్రానికి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని కోరుతూ లేఖ స‌మ‌ర్పించారు. ఇక‌, ఇటీవ‌ల మ‌హానాడులో సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా.. బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరిగారు. మేం ప్రాజెక్టు కట్టుకుంటే మీకేంటి నొప్పి అని కూడా ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. సో.. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.