వైసీపీ అధినేత జగన్ తాజాగా తెనాలిలో పర్యటించడం, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న యువకుల కుటుంబాన్ని పరామర్శించడం ఎలా ఉన్నా, వైసీపీ హయాంలో జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి ఆయన వివరణ ఇస్తే బాగుంటుందన్న ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ పెద్దలకు విధేయులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న చర్చ ఎప్పుడూ ఉంటుంది. అయితే దీనిని జగన్ తప్పుబడుతున్నారు.
కానీ వైసీపీ హయాంలోనూ ఇలానే జరిగింది. విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కట్టి స్టేషన్‌కు తరలించడం, ఆయనపై కేసులు పెట్టడం వంటివి జగన్ మరిచిపోయారా అనేది ప్రశ్న. అలాగే కర్నూలు జిల్లాలో 2023లో ఓ యువకుడిని సీఐ నడిరోడ్డుపై తన్నుకుంటూ వెళ్లిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందన్నది ఎవరికీ తెలియదు.
ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ కారు డ్రైవర్‌ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరికీ తెలుసు. సో.. వైసీపీ హయాంలో తప్పులు జరిగలేదని చెప్పుకునే అవకాశం జగన్‌కు లేదు. అయితే ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు తప్పులు కనిపిస్తున్నాయి. మంచిదే. కానీ గత పాలనలో జరిగిన వాటిపై కూడా మాట్లాడితే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ఏం చేయాలి?
నిజానికి తెనాలి యువకుల ఘటనపై నిష్పాక్షికంగా జగన్ స్పందించాలంటే ఆయనకు రెండు మార్గాలు ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
- పోలీసులకు ఉన్న అధికారాలను హైకోర్టులో సవాల్ చేయడం.
- ఈ ఘటనపై ప్రజాసంఘాలను ఏకం చేయడం.
తద్వారా సమస్యకు పూర్తి పరిష్కారం తీసుకురావచ్చు. కానీ జగన్ అలా చేయకుండా, ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇది ఆయనకు మైనస్ అవుతుందే తప్ప బాధితులకు ప్లస్ కాబోదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates