విడదల రజినీ.. పూర్వాశ్రమంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్ట్రాంగ్ లేడీ. అంతేనా మస్తు మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతగానూ ఆమె గుర్తింపు పొందారు. తొలుత టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజినీ…2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలోకి చేరి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… రెండున్నరేళ్లకే మంత్రి కూడా అయ్యారు. వైసీపీ మంచి ప్రాధాన్యత దక్కిన నేతగానూ రజినీకి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు జగన్ ఆమెను పూర్తిగా పక్కనపెట్టేశారు. జగన్ తెనాలి పర్యటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది.
పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారన్న ఆరోపణలతో ముగ్గురు యువకులపై పోలీసులు నడిరోడ్డుపై లాఠీలు ఝుళిపించారు. ఈ వీడియో బయటకు రావడంతో వారిని పరామర్శించేందుకు జగన్ మంగళవారం తెనాలి వెళ్లారు. ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విడదల రజినీ, స్థానిక నేత అన్నాబత్తుని శివకుమార్ తదిరులు ఉన్నారు. అయితే వీరిలో మిగిలిన వారంతా జగన్ వెంటే కనిపించారు గానీ… ఏ ఒక్క చోట కూడా జగన్ కు దగ్గరగా రజినీ కనిపించిన దాఖలానే లేదు. ఏదో అలా ఓ సామాన్య కార్యకర్త మాదిరిగా ఆమె వ్యవహరించక తప్పలేదు.
వాస్తవానికి గతంలో జగన్ పర్యటనల్లో రజినీ పాలుపంచుకుంటే… జగన్ ను అనుసరిస్తూ కనిపించేవారు. మీడియాతో మాట్లాడే సందర్భంగానూ జగన్ పక్కన్నే నిలబడేవారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో జగన్ పర్యటనల్లో రజినీ పాలుపంచుకున్నా ఇదే తరహా ప్రాదాన్యం ఆమెకు దక్కింది. అయితే ఈ దఫా తెనాలి బాధితుడు జాన్ విక్టర్ ఇంటిలో గానీ, జగన్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా గానీ… రజినీ జాడే కనిపించలేదు. కార్యక్రమం ముగిసిన తర్వాత జగన్ వెళ్లిపోతుంటే… ఆయన వెంట కార్యకర్తలు కదలగా… జగన్ కు అల్లంత దూరాన ఓ సామాన్య కార్యకర్త మాదిరిగా రజినీ కదిలిపోయారు.
అయినా రజినీని జగన్ అంతగా దూరంగా పెట్టడానికి కారణాలేమిటన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని రజినీ అండ్ కో బెదిరించి రూ.2.2 కోట్ల మేర వసూళ్లు చేసిన వైనంపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో రజినీ మరిది గోపి అరెస్టై ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఓ కార్యకర్తను తన కారులో కూర్చోబెట్టుకుని పోలీసుతో రజినీ వాగ్వాదానికి దిగిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో రజినీ అంత సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఏముందన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే రజినీని జగన్ దూరం పెట్టినట్టు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates