శాంతి భద్రతలు కాపాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు దాడి చేశారు. దీంతో, ఆ యువకులకు బుద్ధి చెప్పేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నడి రోడ్డుపై ఆ యువకులకు అరికాళ్ల కోటింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో మరే గంజాయి బ్యాచ్ పోలీసులపై చేయి ఎత్తకుండా పనిష్మెంట్ ఇచ్చారు. పోలీసులను కొట్టిన ఆ యువకులకు తగిన శాస్తి జరిగిందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ యువకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందని, ఇలా నడిరోడ్డుపై శిక్షించడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఆ కోవలోకే మాజీ సీఎం జగన్ జగన్ వస్తారు. ఈ విషయానికి రాజకీయ రంగు పులిమి మైలేజ్ సంపాదించేందుకు జగన్ ప్రయత్నించారు. ఆ యువకులను పరామర్శించేందుకు తెనాలి వెళ్లిన జగన్ కు అనూహ్యంగా షాక్ తగిలింది. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్, దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించడంతో జగన్ షాకయ్యారు. అంతేకాదు, జగన్ గో బ్యాక్ అంటూ తెనాలి మార్కెట్ సెంటర్‌లో దళిత నేతలు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు.
వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను పరామర్శించని జగన్… రౌడీషీటర్లకు మద్దతుగా రావడం ఏంటని దళిత సంఘాల నేతలు నిలదీశారు. తెనాలిలో జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులకు ఈ నిరసనలు షాకిచ్చాయి. ఐతానగర్ సెంటర్‌లో జగన్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకొని…జగన్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. జగన్ కాన్వాయ్‌ను ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశాయి.
దళితులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అని జగన్ ను నిరసనకారులు ప్రశ్నించారు. నల్ల బెలూన్లు ఎగురవేసి జగన్ కు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ప్రస్తుతం తెనాలిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.