తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల కిందట వరకు.. మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయి. మొత్తంగా 108 దేశాలకు చెందిన సుందరీమణులు.. ఈ పోటీలో పాల్గొన్నారు. దాదాపు 20 రోజుల పాటు వారు ఇక్కడే ఉన్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను.. రాష్ట్ర ఉన్నతిని ప్రపంచానికి చాటుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మొత్తంగా ఈ అందాల సుందరుల పోటీలు ముగిశాయి. అయితే.. ఇప్పుడు అసలు పొలిటికల్ కంటెస్ట్ ప్రారంభమైంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి.. కీలకమైన 2 ప్రశ్నలు సంధిస్తూ.. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఈ పోటీలకు.. రాష్ట్ర సర్కారు 200 కోట్లను ఖర్చు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒక్కొక్క కంటెస్టెంటుకు కూడా.. 30 తులాల బంగారు ఆభరణాలను రాష్ట్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చిందని ఆరోపించారు.
ఈ వ్యవహారం.. రాజకీయ రంగు పులుముకుంటోందన్న వాదన తెరమీదికి రావడంతోనే ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని హరీష్‌రావును నిలదీశారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని పద్దులను వివరించారు. మిస్ వరల్డ్ కంటెస్టు కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. మొత్తం ఖర్చును 31 కోట్లుగా పేర్కొన్న జూపల్లి.. దీనిలో 21 కోట్ల రూపాయలు స్పాన్సర్ల నుంచే వచ్చాయని తెలిపారు.
మిగిలిన మొత్తానికి కూడా ఒప్పందాలు ఉన్నాయని.. ఆ సొమ్ములు కూడా వస్తాయని చెప్పారు. అదేవిధం గా పోటీలో పాల్గొన్న అందగత్తెలకు.. ఎలాంటి కానుకలు ఇవ్వలేదని తెలిపారు. 30 తులాల బంగారాన్ని కానుకగా ఇచ్చారన్న హరీష్ రావు వ్యాఖ్యలను కొట్టి పారేశారు. వారికి 3 తులాలు కాదుకదా.. 3 గ్రాముల బంగారాన్ని కూడా కానుకలుగా ఇవ్వలేదని.. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ రువ్వారు. మరి దీనిపై బీఆర్ ఎస్ ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి.