వైసీపీ అధినేత జగన్‌పై జనసేన నాయకులు విమర్శలు గుప్పించారు. తాజాగా మంగళవారం జగన్.. తెనాలిలో పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సర్కారు, పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనను ఉద్దేశించి.. జనసేన నాయకుడు, తిరుపతి జిల్లా పార్టీ ఇన్ చార్జి కిరణ్ రాయల్ స్పందించారు. జగన్‌పైనా, ఆయన వ్యవహార శైలి పైనా తీవ్ర విమర్శలు చేశారు.
గత ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తర్వాత.. భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాదులు చనిపోయారని కిరణ్ రాయల్ అన్నారు. జగన్‌ను వదిలేస్తే.. ఆ ఉగ్రవాదుల కుటుంబాల ను కూడా పరామర్శిస్తారనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. సంఘ విద్రోహ శక్తులను శిక్షించేందుకే పోలీసులు ఉన్నారని తెలిపారు. గొడ్డలిని ఒక చేత్తో, వైసిపి జెండాను మరో చేత్తో పట్టుకుని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు.
“జగన్ తెనాలికి వెళ్ళడం హాస్యాస్పదం. గంజాయి బ్యాచ్ ను జగన్ పరామర్సించడమేంటి..? పహల్గాంలో ఉగ్ర దాడి చేసిన ఉగ్రవాదులను కూడా ఆయన పరామర్శిస్తాడేమో? అధికారం కోల్పోయిన తరువాత జగన్ కు మతిభ్రమించింది.“ అని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. ఇక, ఈ నెల 4న జగన్ చేపట్టనున్న వెన్నుపోటు దినం పైనా రాయల్ స్పందించారు. తన సమస్యను.. తన రాజకీయ నిరుద్యోగాన్ని ప్రజలపై రుద్దతున్నారని వ్యాఖ్యానించారు.
“జగనే పెద్ద వెన్నుపోటుదారుడు. వైసిపి నేతలకు వెన్నుపోటు రాజకీయాన్ని నేర్పించింది జగనే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు లేఖ రాస్తున్నా. `గుండెపోటు` దినం పెట్టమని డబ్ల్యుహెచ్ఓను కోరుతున్నాం. జగన్ సైతాన్ ను మించిపోతున్నాడు.“ అని కిరణ్ రాయల్ విమర్శలకు దిగారు.