చాలా రోజుల తర్వాత.. మాజీ సీఎం జగన్‌పై.. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(ఆర్ ఆర్ ఆర్) స్పందించారు. గతంలో తరచుగా జగన్‌ను టార్గెట్ చేసిన రఘురామ.. ఇటీవల కాలంలో మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తెనాలి యువకులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన ఘటన నేపథ్యంలో ఆ యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
అయితే.. జగన్ తెనాలి పర్యటన.. ఆయన చేసిన విమర్శలపై రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్తులను వెనుకేసుకు వచ్చే జగన్‌ను చూస్తే జాలేస్తోందని చెప్పారు. గంజాయి విక్రేతలు, పోలీసులపై దాడి చేసిన యువకులను పోలీసులు శిక్షిస్తేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. పోలీసుపై హత్యాయత్నం చేసిన నిందితులకు.. జగన్ అండగా నిలవడం..ఎలాంటి సంకేతాలను పంపుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నేరగాళ్లను వెనుకేసుకు వచ్చే నాయకుడు ఉండడం వైసీపీకి నేతలు చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానిం చారు. ఈ సందర్భంగా తనపై వైసీపీ హయాంలో జరిగిన లాఠీ చార్జీపైనా ఆర్ ఆర్ ఆర్ స్పందించారు. గతంలో తనను నిర్బంధించి.. అరికాళ్లపై ఇలానే కొట్టారని.. ఆయన గుర్తు చేసుకున్నారు. నాడు.. తనపై లాఠీలతో విరుచుకుపడేలా చేసింది.. జగనేనని ఆరోపించారు. ఆయన ఇప్పుడు నేరుగా నేరస్తులను వెనుకేసుకు రావడం వైసీపీ నాయకులకు ఆనందం కలిగిస్తోందన్నారు.
కానీ, జగన్‌ను చూస్తే.. తమకు జాలేస్తోందని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయని తెలిపారు. అయితే.. ఏ సబ్జెక్టూ లేకపోవడంతో జగన్ ఈ విషయాన్ని హైలెట్ చేసినట్టు తెలుస్తోందని.. కానీ, ప్రజలు హర్షించడం లేదని చెప్పుకొచ్చారు. నేరస్తులను శిక్షించడం తప్పుకాదన్నారు.