నందిగంతో సజ్జల ములాఖత్… ఇప్పుడే ఎందుకంటే..?

వైసీపీ అదికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఓ రేంజిలో తనదైన హవా సాగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో పాలుపంచుకున్నవారంతా దాదాపుగా నందిగం అనుచరవర్గమేనని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయనపై ఇతరత్రా పలు కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి సర్కారు అదికారంలోకి రాగానే… పాత కేసుల బూజు దులపగా… నందిగం అరెస్టయ్యారు. ఏకంగా 3 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఆ సందర్భంగా సురేశ్ ను జగన్ జైల్లో కలిసి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత సురేశ్ ను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.

కొన్నాళ్లకు ఎలాగోలా బెయిల్ తీసుకుని వచ్చిన నందిగంను ఇటీవలే మరో కొత్త కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నందిగం గుంటూరు జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా నందిగం బాగోగులు, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన సజ్జల.. ఆ తర్వాత బయటకు వచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఓ కేసులో బెయిల్ తెచ్చుకుంటే మరో కేసులో అరెస్టు చేస్తున్నారంటూ కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. కల్పిత కేసులతో వైసీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

ఇదంతా బాగానే ఉంది గానీ… ఇప్పుడే సజ్జల ఈ ములాఖత్ ల బాట పట్టడానికి కారణమేమిటన్న దానిపై వైసీపీలోనే జోరుగా చర్చ జరుగుతోంది. ఎప్పుడు కార్యాలయం దాటి బయటకు రాని సజ్జల…నందిగం సురేశ్ ను కలిసేందుకు ఏకంగా జైలుకు ములాఖత్ దరఖాస్తు చేసుకోవడం, అనుమతి రాగానే జైలుకు వెళ్లి మరీ ఆయనను కలవడం చూస్తుంటే ఇదేదో పెద్ద వ్యూహం మాదిరే కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా మంది నేతలు అరెస్టు అయినా జైళ్ల ముఖం కూడా చూడని సజ్జల ఇప్పుడు తరచూ జైళ్లలోని తమ పార్టీ నేతలను కలవడానికి ఆసక్తి చూపిస్తుండటం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ తరహా సజ్జల వైఖరికి కారణమిదేనంటూ వైసీపీ వర్గాలు ఓ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉండగా… ఆయన వద్ద సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిలను సజ్జల నేరుగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ కలిశారు. ఆ తర్వాత నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని కూడా సజ్జల కలిశారు. ఈ ముగ్గురు నేతలూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. వైసీపీకి చెందిన చాలా మంది నేతలు జైళ్లలో ఉంటే… సజ్జల మాత్రం కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే కలుస్తున్నారు అంటూ ప్రచారం మొదలైందట. ఈ ప్రచారం నిజం కాదని చెప్పేందుకే సజ్జల గుంటూరు జైలుకు వెళ్లి నందిగం సురేశ్ ను కలిశారట.