టీడీపీలో ముగ్గురు మ‌హిళ‌ల పంతం.. హామీ ఇస్తేనే.. అడుగు బ‌య‌ట‌కు‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో అసంతృప్తులు, అస‌మ్మ‌తులు, నిర‌స‌న గ‌ళాలు ఎక్క‌డా స‌ర్దుమ‌ణ‌గ‌డం లేదు. ప‌దువుల పందేరాలు జ‌రిగినా.. జంబో క‌మిటీల‌ను ఏర్పాటు చేసి.. నాయ‌కుల‌కు, నాయ‌కురాళ్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. ఇంకా ఏదో కావాల‌నే ఆరాటం మాత్రం వారిలో ఎక్క‌డా త‌గ్గ‌క పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ జాబితాలో ముగ్గురు కీల‌క మ‌హిళా నాయ‌కురాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. వీరిలో గుమ్మ‌డి సంధ్యారాణి, తోట సీతారామ ల‌క్ష్మి, ప్ర‌తిభా భార‌తి ఉన్నార‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిభా భార‌తి.. త‌న అసంతృప్తిని చంద్ర‌బాబుకు లేఖ రూపంలో వెల్ల‌డించారు.

మిగిలిన ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కులు మౌనంగా ఉన్నారు. త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో పార్టీలో ఈ ముగ్గురు నాయ‌కురాళ్ల విష‌యంపై చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా ఉంది. గుమ్మ‌డి సంధ్యారాణి… టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కురాలు. అర‌కు ఎంపీ స్థానం నుంచి 2014లో పోటీ చేసి.. ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఆమె మ‌ళ్లీ పోటీకి సిద్ధంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆశించిన విధంగా చంద్ర‌బాబు ఆమెకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌నేది తీవ్ర అసంతృప్తి. పైగా ఆమెర‌కు సాలూరు ఎమ్మెల్యే స్థానంపై మ‌క్కువ ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లోనే ఆమె సాలూరు నుంచి టికెట్ ఆశించారు. కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు దీనిని భంజ్‌దేవ్‌కు ఇచ్చారు. ఇక‌, ఇప్పుడైనా.. త‌న‌కు సాలూరు టికెట్‌పై గ్యారెంటీ ఇవ్వాల‌నేది సంధ్యారాణి డిమాండ్‌. దీంతో తాజాగా త‌న‌కు అప్ప‌గించిన‌.. అర‌కు పార్ల‌మెంట‌రీ జిల్లా టీడీపీ బాధ్య‌త‌లు తీసుకునేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. ఇక‌, తోట సీతారామ‌ల‌క్ష్మి. మాజీ రాజ్య‌స‌భ స‌భ్యురాలు.. టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కురాలు. ఈమె కూడా కాకినాడ పార్లమెంటు స్థానంపై ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, చంద్ర‌బాబు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఈ నేప‌థ్యంలో ఆమె కూడా న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ టీడీపీ బాధ్య‌త‌లు తీసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. త‌న‌కు కాకినాడ టికెట్‌పై హామీ ఇస్తేనే అడుగు ముందుకు వేస్తాన‌ని ఆమె స్ప‌ష్టం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి విష‌యానికి వ‌స్తే.. త‌న కుమార్తె గ్రీష్మ విష‌యాన్ని తేల్చాల‌ని, త‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేదని ఆమె ఇటీవ‌ల చంద్ర‌బాబుకు లేఖ‌రాశారు. అయితే, దీనిపై బాబు ఇప్ప‌టికీ స్పందించ‌లేదు. మ‌హిళ‌ల విష‌యంలో ప్ర‌స్తుతం ఈ ముగ్గురూ పార్టీలో నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నార‌ని, బాబు త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ప్ర‌క‌టించాల‌ని సీనియ‌ర్లు కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.