తెలంగాణలో టీఆర్ఎస్ వెర్సస్ కాంగ్రెస్ పాత కథ. ఇప్పుడంతా టీఆర్ఎస్ వెర్సస్ బీజేపీనే. కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి బీజేపీనే ప్రధాన ప్రతిపక్షస్థానంలోకి వచ్చేసింది. టీఆర్ఎస్‌ను గట్టిగా ఢీకొడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రెండు పార్టీ మధ్య వైరం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే.
అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ క్యాండిడేట్ గట్టి పోటీనే ఇచ్చాడని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐతే తమ పార్టీని బీజేపీ ఎంతగా టార్గెట్ చేస్తుంటే.. అంతగా రివర్స్‌లో ఆ పార్టీని ఢీకొడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మీదా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గణాంకాలతో మోడీ సర్కారును కడిగి పారేశారు.
గత నెలలో తెలంగాణ వరదలతో అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని 1350 కోట్ల తక్షణ సాయం అడిగింది తెలంగాణ సర్కారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. కానీ బీజేపీ పాలిత గుజరాత్‌కు మాత్రం వరద సాయం కింద ప్రధాని మోడీ రూ.500 కోట్లు విడుదల చేశారు. అలాగే ఆ పార్టీనే అధికారంలో ఉన్న కర్ణాటకకు అదనపు సాయం రూ.670 కోట్లు రిలీజ్ చేశారు.
తెలంగాణకు మాత్రం పైసా ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వార్తల తాలూకు క్లిప్పింగ్స్ పెట్టి మరీ కేటీఆర్.. కేంద్రాన్ని నిలదీశారు. హైదరాబాద్ చేసిన తప్పేంటి? అక్కడ వరదలొస్తే తక్షణ సాయం, ఇక్కడ మాత్రం బురద రాజకీయం అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు 2014 నుంచి తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి రూ.2,72,926 కోట్లు చెల్లిస్తే.. రాష్ట్రానికి కేంద్రం రూ.1,40,329 కోట్లు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.