తిరువూరు డ్రామా కు తెరపడింది

ఏపీలో స్థానిక సంస్థల పాలక వర్గాలు వరుసబెట్టి వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలకు షిప్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నా కూడా ఆయా పురపాలికలకు చెందిన మెజారిటీ సభ్యులు వైసీపీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే విశాఖ, తిరుపతి వంటి కీలక నగరపాలక సంస్థలు టీడీపీ వశం కాగా… తాజాగా కృష్ణా జిల్లా పరిధిలోని తిరువూరు నగర పంచాయతీ కూడా టీడీపీ ఖాతాలో పడిపోయింది.

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలికపూడి శ్రీనివాసరావు తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈయనకు టీడీపీ అధిష్ఠానం నుంచి మంచి మద్దతు ఉన్నా.. నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడంలో కొంత ఇబ్బంది పడ్డారు. ఫలితంగా ఎప్పుడో టీడీపీ పరం కావాల్సిన తిరువూరు నగర పంచాయతీ పాలకవర్గం పలుమార్లు వాయిదా పడింది. ఘర్షణ వాతావరణానికీ వేదికైంది. అటు వైసీపీ, ఇటు టీడీపీల మధ్య మెజారిటీ విషయంలో స్వల్ప తేడా ఉన్నా కూడా దానిని తన వైపు తిప్పుకోవడంలో కొలికపూడికి కొంత సమయం పట్టింది.

ఇప్పటికే పలుమార్లు తిరువూరు నగర పంచాయతీ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఈ సందర్బంగా వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత దేవినేని అవినాశ్ పై ఏకంగా కిడ్నాప్ కేసు కూడా నమోదు అయ్యింది. అన్ని పరిస్థితులను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం… జూన్ 2(సోమవారం)న తిరువూరు నగర పంచాయతీ చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అనుకున్నట్లుగానే.. సోమవారం ఎలాంటి గొడవ లేకుండానే నగర పంచాయతీ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. చైర్ పర్సన్ గా కొలికపోగు నిర్మలను టీడీపీ ప్రతిపాదించింది.

నిర్మలకు మద్దతుగా మొత్తం 12 ఓట్లు రాగా… ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నుంచి 9 ఓట్లు పడ్డాయి. దీంతో నిర్మలను తిరువూరు నగర పంచాయతీ చైర్ పర్సన్ గా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నిర్మలకు మద్దతుగా 11 మంది టీడీపీ కౌన్సిలర్లతో పాటుగా ఎమ్మెల్యే హోదాలో కొలికపూడి ఓటును కలుపుకుని మొత్తం 12 ఓట్లు నమోదు అయ్యాయి. గత స్తానిక సంస్థల ఎన్నికల్లో తిరువూరును వైసీపీ గెలుచుకోగా…మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత అన్ని స్తానిక సంస్థల మాదిరిగానే తిరువూరులోనూ వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఫలితంగా తిరువూరు నగర పంచాయతీపై టీడీపీ జెండా ఎగిరినట్టైంది.