తెలంగాణలో అదికార పార్టీ కాంగ్రెస్ లో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మంత్రివర్గ విస్తరణ అదుగో, ఇదుగో అంటూ అధిష్ఠానం కాలయాపన చేస్తున్న కొద్దీ కొత్తగా ఆశావహులు చేరిపోతున్నారు. ఫలితంగా మంత్రి పదవుల కోసం పోటీ ఓ రేంజిలో పెరిగిపోతోంది. ఈ పోటీ, నేతల మధ్య మాటల తూటాలు.. ఇవేవీ పట్టని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. ఆయా నేతలను పిలిచి వేర్వేరుగా భేటీ అవుతున్నారు. అందులో బాగంగా సెలవు దినం ఆదివారం ఇటీవలే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి, పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ లు మీనాక్షితో భేటీ అయ్యారు.
మీనాక్షితో విజయశాంతి భేటీ సుమారుగా 15 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీలో బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని విజయశాంతి డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తనకు మంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించడమే లక్ష్యంగా సాగానని… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచానని కూడా ఆమె వివరించారట. రాజకీయాల్లో తన సీనియారిటీ, వైరి వర్గాలను తాను ఎదుర్కొొంటున్న తీరులనూ రాములమ్మ ఆమెకు వివరించినట్లు సమాచారం. విజయశాంతి చెప్పినవన్నీ నోట్ చేసుకున్న మీనాక్షి చూద్దాం అంటూ ఆమెకు చెప్పి పంపారట.
ఇదిలా ఉంటే… పార్టీని ఆది నుంచి అంటిపెట్టుకుని ఉన్న వారిలో తాను ఒకడినని అద్దంకి దయాకర్ తనను తాను మీనాక్షి ముందు ప్రొజెక్ట్ చేసుకునే యత్నం చేశారట. ఏళ్లుగా ఎలాంటి పదవులు దక్కకున్నా… పార్టీనే నమ్ముకుని ఉన్నానని, ఇప్పటికి గానీ తనకు ఎమ్మెల్సీ .పదవి దక్కిందని ఆయన చెప్పారట. ఇలాంటి కీలక సమయంలో తనలాంటి పార్టీ విధేయుులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే…ప్రజల్లో పార్టీకి మంచి మైలేజీ పెరుగుతుందని తెలిపారట. తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తనను పలు పార్టీలు ఎన్నెన్నో ప్రలోభాలకు గురి చేశాయని, కాని తాను మాత్రం పార్టీనే నమ్ముకుని ఉన్నానని తెలిపారట. ఈ నేపథ్యంలో అన్ని పరిస్థితులను పరిశీలించిన తనకు మంత్రి పదవి కేటాయించాల్సిందేనని ఆయన మీనాక్షిని కోరారట.
వాస్తవంగా అటు రాములమ్మ అయినా, ఇటు అద్దంకి దయాకర్ అయినా మంత్రి పదవులకు నూటికి నూరు పాళ్లు అర్హులే. సమర్థత ఉన్న నేతలే. అధికారం ఉన్నా, లేకున్నా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంలో వీరు ఏ ఒక్కరికీ తక్కువ కాదని చెప్పక తప్పదు. సమకాలీన రాజకీయాలతో పాటు పాలనాపరమైన అంశాలపైనా వీరిద్దరికీ సమగ్రమైన పట్టు ఉందని కూడా చెప్పాలి. వీరిద్దరికీ ఒకేసారి ఎమ్మెల్సీ పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మంత్రి పదవులూ ఖాయమేనన్న విశ్లేషణలు సాగాయి. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో వీరికి మంత్రి పదవులు దక్కుతాయా? లేదా? అన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.