బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తన పని తాను చేసుకుపోతున్నారు. రాజకీయంగా ఆమె చుట్టూ అనేక చర్చలు సాగుతున్నా.. తన పని , తన షెడ్యూల్ విషయంలో కవిత దూకుడుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా నిరసనకు పిలుపునిచ్చారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధిపతి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 5న విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
అయితే.. గతంలోనే కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత.. ఇటీవల మీడియా ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే.. ఒక్క నిరసన కూడా ఎవరూ తెలపలేదని ఆమె వ్యాఖ్యానించారు. కేవలం ఒక ట్వీట్‌కు మాత్రమే పరిమితం అయ్యారని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తమ నాయకుడు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసనకు రెడీ అయ్యారు.
జూన్ 4న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో కవిత నిరసన వ్యక్తం చేయను న్నారు. ఈ మేరకు తాజాగా ఆమె ప్రకటించారు. కాగా.. కవిత ప్రకటన.. బీఆర్ఎస్‌లో మరోసారి చర్చకు దారితీసింది. ఆమె దూకుడు కారణంగా.. ఇతర నేతలు హర్టయ్యే అవకాశంఉందని సమాచారం. పైగా.. అధినేతను కలిసి.. ఆయన ఆశీస్సులు తీసుకుని.. ఆయన అనుమతితో ధర్నా చేయాల్సి ఉంటుందని.. పలువురు నాయకులు చెబుతున్నారు.
కవిత చేసే నిరసన పార్టీ పరంగా కాబట్టి.. ఆమెకు పార్టీ అధినేతగా కేసీఆర్ అనుమతి ఇస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లేదు.. వ్యక్తిగతంగా నిరసన తెలిపితే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, బీఆర్ఎస్ తరఫున నిరసన అంటే మాత్రం.. పార్టీ అధినేత అనుమతి ఉండాలని పలువురు చెబుతున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు.. తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కూడా కవిత ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.