ఏ మొహం పెట్టుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌స్తారు?: బాబు

“ఏ మొహం పెట్టుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌స్తారు? గంజాయిని విచ్చ‌ల‌విడి చేశామ‌ని.. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కట్ట‌డి చేసింద‌ని చెప్పుకొనేందుకు వ‌స్తారా? మేం భూములు దోచుకున్నాం.. ఇప్పుడు విచార‌ణ చేస్తున్నార‌ని.. పేద‌ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తున్నార‌ని చెప్పేందుకు వ‌స్తారా? చీపులిక్క‌ర్‌ను విక్ర‌యించి.. డ‌బ్బులు దోచుకున్నాం.. ఇప్పుడు మ‌ద్యాన్ని క‌ట్ట‌డి చేసి.. నాణ్య‌మైన మ‌ద్యాన్నిఇస్తున్నార‌ని చెప్పుకొనేందుకు వ‌స్తారా? “అంటూ.. వైసీపీ నాయ‌కుల‌పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి పెరిగిందని చంద్రబాబు అన్నారు. కానీ.. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. దీనిని క‌ట్ట‌డి చేశామ‌న్నారు. డ్రగ్స్ విక్రయించినా.. కొనుగోలు చేసినా తాట తీస్తున్నామ‌న్నారు. కానీ, దీనిని చూసి వైసీపీ నాయ‌కులు ఓర్చుకోలేక పోతున్నార‌ని చెప్పారు. అందుకే ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వచ్చి విధ్వేషాన్ని ర‌గిలించి.. కూట‌మి ప్ర‌భుత్వంపై ఏదో చేయాల‌ని కుట్ర ప‌న్నార‌ని వ్యాఖ్యానించారు.

వైసీపీ ఆట‌లు సాగ‌బోవ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని చంద్రబాబు అన్నారు. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామ‌న్న ఆయ‌న‌.. శ‌క్తి యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. ఇప్పుడిప్పుడే.. వైసీపీ అరాచ‌కాల‌ను క‌ట్ట‌డి చేసి.. పెట్టుబడులు తీసుకువ‌స్తున్నామ‌ని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్త‌లు ముందుకొస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ చూసి వైసీపీ నాయ‌కులకు క‌డుపు మండిపోతోంద‌న్నారు.

అందుకే ప్ర‌జ‌ల‌లోకి వ‌స్తున్నామ‌ని చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. “పేదలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నాం. హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచాం. పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచాం. 64 లక్షల మందికి ప్రతినెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నాం.” అని చంద్ర‌బాబు చెప్పారు. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామ‌న్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామ‌ని చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లేన‌ని, తాము వ‌చ్చాక అద్దం లాంటి రోడ్ల‌ను నిర్మిస్తున్నామ‌న్నారు. ఇవ‌న్నీ చూసి ఓర్చుకోలేక త‌మ‌పై అభాండాలు వేసేందుకు వైసీపీ నాయ‌కులు వ‌స్తున్నార‌ని.. వారి క‌ల్లబొల్లి మాట‌లు న‌మ్మొద్ద‌ని ఆయ‌న సూచించారు.