మా పిల్లలకు అవకాశాలివ్వండి – సీఐఐకి బాబు ఆఫర్

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానంతో హాజరైన ఆయన, ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ఒక విజనరీగా కీలక ప్రసంగం చేశారు. తన ఆలోచనలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో పంచుకున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై ఆయన దృష్టి పెట్టారు: సంపద సృష్టి, పెట్టుబడులు.

సంపద సృష్టి పారిశ్రామిక వేత్తల కారణంగానే సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాల అమలుకు సంపద సృష్టే మార్గమని ఆయన అన్నారు. ఇందుకోసం పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాలు కోలుకోవాలంటే పెట్టుబడులు అవసరమని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు లేవని, ఇప్పుడు మెరుగైన పాలసీలతో పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన యువశక్తి ఉందని, పెట్టుబడులకు వచ్చినవారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

దేశంలో పీవీ నరసింహారావు హయాంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు రాష్ట్రాల ముఖచిత్రాన్ని మార్చాయని, ఐటీ విప్లవం దేశానికి గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆ ఐటీ విప్లవాన్ని ఉపయోగించి హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను తానే నిర్మించానని తెలిపారు. దేశంలో ఉన్న విద్యావంతులైన యువతను వినియోగించుకునే శక్తి పారిశ్రామిక రంగానిదని, ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక వేత్తలు అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమైతే, వారికి ఏపీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖపట్నంలో ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. ఏడాదిలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే లక్ష్యమని, దాంతో సంపదను సృష్టించి ప్రజలతో పంచుకోవాలన్నదే తమ అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు.