మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణలో తుది పోటీలు ఈ నెల 31న జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బ్రిటన్‌కు చెందిన `మిస్ ఇంగ్లండ్` మిల్లా మాగీ.. ఈ పోటీల నుంచి మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే.. పోతూ.. పోతూ.. కొన్ని విమర్శలు, ఆరోపణలు చేసింది. తెలంగాణ ఆతిధ్యం బాగుందని.. ఇక్కడి ప్రజలు మంచి వారని.. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసిందన్న మాగీ.. పోటీలపై మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తనను వేశ్య మాదిరిగా చూశారని.. ధనవంతులైన స్పాన్సర్ల పక్కన కూర్చుని వారిని అలరించేలా వ్యవహరించాలని ఆదేశించార ని.. ఆరోపించారు. అంతేకాదు.. తమను బ్రేక్ ఫాస్ట్ సమయంలోకూడా మేకప్ తీయకుండా బలవంతం చేశారని.. నిర్వాహకులపై ఆరోపణలు గుప్పించారు. దీనికి సంబంధించి బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇదిలావుంటే.. ఈ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. మహిళల ఆత్మగౌరవంతో ముడిపెట్టిన బీఆర్ ఎస్ కీలక నాయకులు రేవంత్ రెడ్డి సర్కారు దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కూడా విచారణకు డిమాండ్ చేయడంతో సర్కారు అదే పనిచేసింది.
తాజాగా ఈ విచారణ నివేదిక అందింది. ముగ్గురు ఐపీఎస్ మహిళా అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఈ విచారణ తాలూకు నివేదికపై రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్పందించారు. దీనిలో అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. ఆరోపణలు నిజమో కాదో.. అనే విషయంపైనే తాము దృష్టి పెట్టామని.. నిర్వాహకులు సహా సహ కంటెస్టెంట్ల నుంచి కూడా విచారణాధికారులు వివరాలు తెలుసుకున్నట్టు చెప్పారు. అయితే.. దీనిపై ప్రభుత్వం కేవలం విచారణకు మాత్రమే పరిమితం అవుతుందని.. చర్యలు తీసుకోబోదని ఆయన పేర్కొన్నారు.
మిల్లా మాగీపై లండన్ కోర్టులో మిస్ వరల్డ్ నిర్వాహకులు కేసు వేశారని.. అక్కడ విచారణ జరుగుతుందన్నారు. నిర్వాహకులు కోరితే.. తెలంగాణ ప్రభుత్వం చేయించిన విచారణ నివేదికను అందించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు రాకుండా.. ఎలా వ్యవహరించాలనే విషయాలపైనా విచారణాధికారులు తమకు సూచనలు చేశారని చెప్పారు. దీంతో ప్రస్తుత వివాదం సమసిపోయినట్టుగానే భావిస్తున్నట్టు రంజన్ చెప్పారు.