పవన్ కూడా సర్వే చేయించుకుంటున్నారు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా కొన్ని గణాంకాలు, పద్ధతులు పాటిస్తారు. ప్రతి విషయంలో ప్రజల నుంచి సంతృప్తిని కోరుకుంటారు. చివరికి మద్యంపైనా ఆయన సంతృప్తి పాళ్లను లెక్కించుకున్నారు. అంటే ఇది తప్పుకాదు, ప్రజల అభిప్రాయాలను అన్ని విషయాల్లోనూ తెలుసుకునే ప్రక్రియ. తద్వారా ప్రభుత్వ విధానాలను సమీక్షించి, అవసరమైతే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును కూడా చంద్రబాబు అంచనా వేస్తూనే ఉన్నారు.

ప్రజల అభిప్రాయాల మేరకు మార్పులు చేసుకుంటూ పాలనపై సంతృప్తిని సాధిస్తున్నారు. ఈ పరంపరలోనే కూటమి పార్టనర్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సర్వేలు చేపడుతున్నారు. తన పార్టీ తరఫున ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారికి అప్పగించిన శాఖలు సహా తానే చూస్తున్న మూడు నాలుగు శాఖలలో అధికారుల పనితీరును తెలుసుకుంటున్నారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? తాము ఏమి చేస్తున్నారు? అన్న విషయాలను సర్వే రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తద్వారా ప్రజలకు–పాలనకు మధ్య తేడాలు ఉంటే వాటిని అరికట్టేందుకు, మరింత మంచి పాలనను అందించేందుకు అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. మంత్రులుగా ఉన్న ముగ్గురిని తీసేస్తే, జనసేనకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు నుంచి ఐదుగురి వ్యవహారం వివాదంగా మారిందని జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. వ్యక్తిగతంగానే కాకుండా కూటమి పరంగా కూడా ఈ అంశాలు సమస్యలుగా ఉన్నాయి.

కూటమి పార్టీలతో కలిసిపనిచేయకపోవడం, స్థానిక నాయకులతో సంబంధాలు లేకపోవడం, నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు వంటి అంశాలు జనసేన నేతల దృష్టికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆ 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై జనసేన సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా విమర్శలు వస్తున్న ఎమ్మెల్యేలు, కలిసిపనిచేయని ఎమ్మెల్యేలు కూడా మార్పు దిశగా తమను తాము మార్చుకుంటారని అంచనా వేస్తున్నారు. మరి ఈ సర్వేలో ఏం జరుగుతుందో చూడాలి.