వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కంపెనీలు రాకపోవడం, ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం, జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం, రాజధాని లేకపోవడం వంటి కారణాలతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పేరు భ్రష్టుపట్టిందని విమర్శలు వచ్చాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరువు నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వేసిన ఓట్లతో కూటమి గెలిచిందని, అందువల్ల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పరపతి పెరిగిందని తెలిపారు.
మహానాడు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు వైఎస్సార్సీపీ పై మండిపడ్డారు. అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, కూటమి ప్రభుత్వంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ఏర్పాటు చేశాయని వివరించారు. కడప గడపలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రాయలసీమలో వైసీపీకి 7 సీట్లు వస్తే, కడప జిల్లాలోనే కూటమి 7 సీట్లు గెలిచిందని గుర్తు చేశారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాలన్నింటినీ గెలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో కడపలో హింసా రాజకీయాలు, కేసులు రాజ్యమేలాయని అన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హింసా, కక్షా రాజకీయాలు తగ్గాయని తెలిపారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్‌ను రూపుమాపిన తాను, కఠినంగా వ్యవహరించానని చంద్రబాబు గుర్తు చేశారు. ఫ్యాక్షన్ తగ్గిన తర్వాత సీమ అభివృద్ధి చెందిందా లేదా అనే ప్రశ్నను ఆయన ఎదురుపెట్టారు.
“వై నాట్ గొడ్డలి పోటు” అనేది టీడీపీ విధానం కాదని, ప్రతి క్షణం కష్టపడి ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే తమ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. “క్లైమోర్ మెన్‌లకే భయపడని నేను, ఈ సమస్యలను చూసి భయపడతానా?” అంటూ ప్రశ్నించారు. సంపద సృష్టించడం, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం తన జీవిత లక్ష్యమని తెలిపారు. పార్టీని నమ్మిన ప్రజల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates