వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేవుని గడప అయిన కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. మహానాడు గ్రాండ్ సక్సెస్ కావడం చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ మహానాడుపై జగన్ తన అక్కసు వెళ్లగక్కుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు పెద్ద డ్రామా అని జగన్ షాకింగ్ కామెంట్లు చేస్తూ విషం కక్కారు.
కడపలో మహానాడు పెట్టి జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అని జగన్ అన్నారు. మహానాడులో చంద్రబాబు ఫోజులిస్తున్నారని, టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని జగన్ సెటైర్లు వేశారు. టిడిపి నేతలు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ప్రతి ఇంట్లో ఉన్నాయని, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని జగన్ అన్నారు.
రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారని, రాజకీయాలను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి, బెదిరించి చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని, చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన అని జగన్ విమర్శించారు. కోవిడ్ వంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగినా వాటిని సాకుగా చూపించకుండా ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని చెప్పారు. అందుకే, అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని జగన్ గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.