క్ష‌ణం తీరిక లేదు.. బాబు షెడ్యూల్ చూస్తే.. నివ్వెర‌పోతారు!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటేనే సాధార‌ణంగా ప‌ని రాక్ష‌సుడు అనే పేరుంది. రోజుకు 18 గంట‌ల పాటు ఆయ‌న ప‌నిచేస్తుంటార‌ని అంటారు. క‌నిపించే ఫ‌లితాన్ని బ‌ట్టి చూసినా అది నిజమేన‌ని తేలుతుంది. ఇక‌, తాజాగా క‌డ‌ప‌లో మ‌హానాడు జ‌రుగుతోంది. దీనిని స‌క్సెస్ చేసేందుకు ఎంతో మంది నాయ‌కులు ఉన్నా 19కి పైగా క‌మిటీలు ఉన్నా.. చంద్ర‌బాబే అన్నింటినీ జాగ్ర‌త్త‌గా చూసుకున్నార‌న్నది తెలిసిందే.

సో.. ఈ వ‌య‌సు(75)లో ఆయ‌న ఇంత బిజీగా ఉండ‌డం అన్నీ తానే అయి నిర్వ‌హించ‌డం ఒక స్టోరీ అయితే.. మ‌హానాడు ముగియ‌కుండానే వ‌చ్చే మూడు రోజుల పాటు ఆయ‌న ఎంత బిజీగా ఉన్నారో.. తెలిస్తే.. అంద‌రూ నివ్వెర పోతారు. అంత బిజీ అయిపోయారు చంద్ర‌బాబు. గురువారం సాయంత్రం  మ‌హానాడు లో భారీ బ‌హిరంగ స‌భ ఉంది. దీనికి ఐదు ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు హాజ‌రు అవుతార‌ని అంచ‌నా వేశారు. మొబిలైజేష‌న్ కూడా అలానే ఉంది.

అయితే.. ఈ స‌మావేశాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు.  సుదీర్ఘ ప్ర‌సంగం కూడా చేయనున్నారు. గ‌త మూడు రోజుల నుంచి కూడా మ‌హానాడులో తీరిక లేకుండా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మూడో రోజు సాయంత్రం స‌భ ముగిసీ ముగియ‌గానే.. ఢిల్లీ ఫ్ల‌యిట్ ఎక్కేయ‌నున్నారు. చంద్ర‌బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు(శుక్ర‌వారం) ఢిల్లీలో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు, రాయితీల‌పై చ‌ర్చించ‌నున్నారు.

ఇక‌, శ‌నివారం ఉద‌యం నేరుగా.. ఆయ‌న ఢిల్లీ నుంచి రాజ‌మండ్రికి వ‌స్తారు.  కోనసీమ జిల్లా ముమ్మిడి వరం మండలం సీహెచ్ గునేపల్లికి చేరుకుని సామాజిక భ‌ద్రతా పింఛ‌న్ పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొం టారు. అనంత‌రం.. అక్క‌డే స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ల‌బ్ధిదారులతో ముఖాముఖి చ‌ర్చించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం.. పార్టీ నాయ‌కుల‌తో భేటీ కానున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. గ‌త రెండు రోజులుగా మ‌హానాడుతో బిజీగా ఉన్న చంద్ర‌బాబు.. ఇది అయ్యీ అవ్వ‌క‌ముందే.. వ‌చ్చే మూడు రోజుల పాటు తీరిక లేకుండా గ‌డుపుతుండ‌డం గ‌మ‌నార్హం.