తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్నికయ్యారు. ఇప్పటికే 30 ఏళ్లుగా టీడీపీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నుకుంటూ టీడీపీ వార్షిక వేడుక మహానాడు తీర్మానం చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు చేత పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. ఈ వేడుక టీడీపీ నేతలు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అంగరంగ వైభంగా జరిగింది.
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995లో చంద్రబాబు టీడీపీ అధినేతగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి దాకా చంద్రబాబే పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ నియమావళి ప్రకారం ప్రతి రెండేళ్లకు ఓ సారి పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికకు ఆయా ఏడాదుల్లో జరుగుతున్న మహానాడులే వేదికగా నిలుస్తున్నాయి. తాజాగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలో జరుగుతున్న మహానాడు వేదికగా చంద్రబాబు మరోమారు అధినేతగా ఎన్నికయ్యారు. ఈ సారి కూడా ఈ పదవిలో చంద్రబాబు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఇదిలా ఉంటే… పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన మహానాడు తొలి రోజు అయిన మంగళవారమే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆ తర్వాత పార్టీకి చెందిన పలువురు సీనియర్లు దాదాపుగా 21 మంది నేతలు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబును ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. చివరాఖరుగా ఆ నామినేషన్లపై బుదవారం వర్ల రామయ్య సంతకం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి ఇంకే నేత నుంచి కూడా నామినేషన్ రాని నేపథ్యంలో చంద్రబాబు పేరునే పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపికైనట్లుగా వర్ల ప్రకటించారు. ఈ సారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన చంద్రబాబు… ఈ టెర్మ్ ను పూర్తి చేసుకుంటే… 32 ఏళ్ల పాటు టీడీపీ అధినేతగా ఆయన కొనసాగినట్టు అవుతుంది.