తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన వద్దకు ప్రత్యేకంగా రావొద్దని.. ఏదైనా ఉంటే.. సామూహికంగా వచ్చి అధికారులకు సమస్యలు వివరించాలని కూడా ఆయన తేల్చేశారు. అదే సమయంలో కారణాలు ఏవైనా కూడా.. పవన్ ఆగ్రహంతో అనేక రూపాల్లో సినిమా హాళ్ల పై ప్రభావం అయితే పడుతుంది. దీనిని ఎవరూ కాదనలేరు. ఇప్పటి వరకు ఉన్న విధానం వేరు.. ఇప్పటి నుంచి ఉండే విధానం వేరన్నట్టుగా సాగుతుంది. తాజాగా సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని పవన్ తీసుకున్న నిర్ణయాలు.. చేసిన ఆదేశాలు కూడా.. ఆసక్తిగా మారాయి.
ప్రధానంగా సినిమా నిర్మాతలు, దర్శకుల పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. అదే సమయంలో ప్రేక్షకులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కీలక అంశాలపైనా పవన్ దృష్టి పెట్టారు. తినుబండారాల నుంచి సౌకర్యాల వరకు అన్నింటినీ విచారణ చేయాలని ఆయన మంత్రి కందుల దుర్గేష్‌కు సూచించారు. అంతేకాదు.. సగటు ప్రేక్షకుల కోణంలోనే సినిమా హాళ్లలో వ్యాపారాలు ఉండాలని తెలిపారు. దీంతో పవన్ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారు. ప్రస్తుతం సినిమా హాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే.. నిర్బంధించి.. సొమ్ములు గుంజడమేనన్న అభిప్రాయం బలంగా ఉంది.
ఉదాహరణకు బయట పాప్ కార్న్ రూ.50 ఉంటే.. సినిమా హాళ్లలో రూ.250 వరకు ఉంది. బయట సమోసా రూ. 30 ఉంటే.. సినిమా హాళ్లలో 50 వసూలు చేస్తున్నారు. బయట నుంచి కనీసం మంచి నీటి బాటిల్‌ను కూడా తీసుకురాకుండా అడ్డుకుం టున్నారు. పోనీ హాల్‌లో కొందామంటే.. రూ.20 బాటిల్‌ను రూ.40కి విక్రయిస్తున్నారు. ఇక మరుగు దొడ్ల పరిస్థితి మరింత అధ్వానం. ఏసీని ప్రారంభంలో ఉంచి.. మధ్యలోనే తీసేయడం.. ఇలా సినిమా కష్టాలు అనేకం ఉన్నాయి.
తాజాగా పవన్ ఆయా అంశాలన్నింటిపైనా విచారణకు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, తూనికలు, కొలతల శాఖలను రంగంలోకి దింపుతున్నారు. సినిమా హాళ్లను కూలంకషంగా పరిశీలించడంతోపాటు.. వాటి తీరు తెన్నులు తెలుసుకుంటారు. తినుబండారాల విషయం నుంచి శుభ్రత వరకు కూడా కొరడా ఝళిపించనున్నారు. తద్వారా.. పవన్ లక్ష్యం నెరవేరడం ఎలా ఉన్నా.. సగటు ప్రేక్షకులకు మాత్రం చాలా వరకు స్వాంతన చేకూరుతుందన్న చర్చ జరుగుతోంది. తాజా పవన్ నిర్ణయం సగటు ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుందో లేదో చూడాలి.