=

మహానాడు వేదికపై అన్నగారి ప్రత్యక్ష్యం, ప్రసంగం

కడపలో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక మహానాడు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఈ వేడుక ప్రారంభం రోజైన మంగళవాంరం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. అదేంటీ… ఏటా మహానాడు జరుగుతూనే ఉంది కదా… ఈ ఏటి మహానాడు ప్రత్యేకత ఏమిటి? అంటూ కొందరు నొసలు చిట్లించారు. అయితే ఆ ప్రశ్నలకు రెండో రోజైన బుధవారం సిసలైన సమాధానం వచ్చేసింది. 30 ఏళ్ల క్రితం మరణించిన పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు కడప మహానాడు వేదికపై బుధవారం ప్రత్యక్షమయ్యారు. వేదికపై ఎన్టీఆర్ ను చూసి టీడీపీ శ్రేణులతో పాటు తెలుగు ప్రజలు నోరెళ్లబెట్టి చూస్తుండగానే… ఏకంగా తెలుగు ప్రజలను ఉద్దేశించి ఎన్టీఆర్ కీలక ప్రసంగం చేశారు కూడా.

అయినా 30 ఏళ్ల క్రితం చనిపోయిన ఎన్టీఆర్… ఇప్పుడు కడప మహానాడు వేదికపై ప్రత్యక్ష్యం కావడం ఏమిటి? ఏకంగా ప్రసంగించడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదండి. చంద్రబాబు తన చేతిలోని అధునాతక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ అద్భుతాన్ని వేదికపై ఆవిష్కృతమయ్యేలా చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా ఇప్పుడు న్యూస్ యాంకర్లను కూడా కృత్రిమంగా సృష్టిస్తున్నాం కదా. అదే మాదిరిగా చంద్రబాబు తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి ఏఐ ఆధారిత ఎన్టీఆర్ ను కడప మహానాడు వేదికపై ప్రత్యక్ష్యం అయ్యేలా చేశారు. టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలను ఉద్దేశించి ఏకంగా 5 నిమిషాల పాటు ఎన్టీఆర్ ప్రసంగించేలా చేశారు.

దాదాపుగా 5 నిమిషాల 20 సెకన్ల పాటు ప్రసంగించిన ఏఐ ఎన్టీఆర్… తెలుగు నేలలోని పరిస్థితులను ప్రస్తావించారు. తెలుగు నేల అభివృద్ధి కోసం టీడీపీ చేసిన కృషిని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం టెక్ వరల్డ్ లో ఎక్కడికెళ్లినా తెలుగు వారే ఆధిపత్యం చెలాయిస్తున్న వైనాన్ని కూడా ఆయన గర్వంగా ప్రస్తావించారు. నెలకు లక్ష రూపాయల వేతనాన్ని ఆలోచించడానికే సాధ్యం కాని వేళ… దానిని సాకారం చేసి… వేలు, లక్షలాది మంది తెలుగు యువత 5 అంకెల జీతాన్ని సంపాదించేలా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన తెలిపారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి అయిన తన మనవడు నారా లోకేశ్ పనితీరును ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ఆయనను ఆకాశానికెత్తేశారు. మనవడా భళా అంటూ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉన్నట్టుండి మహానాడు వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్ పై ఎన్టీఆర్ ప్రత్యక్ష్యం కావడం, దాని నుంచి తేరుకునేలోగానే ఎన్టీఆర్ ప్రసంగం మొదలుపెట్టడంతో టీడీపీ శ్రేణులు అలా స్థాణువులై చూస్తూ ఉండిపోయారు. వేదికపై ఉన్న కీలక నేతలు కూడా ఎన్టీఆర్ అలా మాట్లాడుతూ ఉంటే ఆసక్తిగా గమనిస్తూ సాగారు. ఇక ఎన్టీఆర్ ప్రసంగం ముగిసిన వెంటనే అప్పటిదాకా తామంతా ఏదో ట్రాన్స్ లో ఉండిపోయినట్లు, ప్రసంగం పూర్తి కాగానే ఆ ట్రాన్స్ లో నుంచి తాము బయటపడినట్టు నేతల ముఖారవిందాలు కనిపించారు. ఈ తరహా హావభావం లోకేశ్ ముఖంలోనూ స్పష్టంగా కనిపించడం గమనార్హం.