ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నివాళులర్పించారు. ఎన్టీఆర్ పేదల దేవుడిగా కీర్తి గడించారని చెప్పారు. అభిమాన ధనుడిగా.. తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడంలోను.. పేదలను ఆదుకోవడంలోనూ.. ఎన్టీఆర్ ఆదర్శ నాయకుడని ప్రధాని పేర్క న్నారు. ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానన్నారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన ఆమహనీయుడు తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు.
సినీ రంగంలోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ప్రధాని పేర్కొన్నారు. ఆ మహనీయుడి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. కాగా.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం నివాళులర్పించారు. ఇటీవల రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించేందుకు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ.. ఎన్టీఆర్‌ను స్మరించుకున్న విషయం తెలిసిందే.