వైసీపీ అధినేత జగన్ పర్యటన వాయిదా పడింది. ఆయన బుధవారం.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి నాలుగు రోజుల కిందటే ప్లాన్ చేసు కున్నారు. దీంతో స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఇటీవల ప్రకటించినట్టు ప్రజల్లోకి వస్తున్నా.. అని చెప్పడంతో ఇక్కడ సభ కూడా పెట్టే అవకాశం ఉందని భావించిన నాయకులు దానికి కూడా ఏర్పాట్లు చేశారు.
అయితే.. అనూహ్యంగా ఈ పర్యటన వాయిదా పడింది. దీనికి కారణాలు పెద్దవేమీ కాదు. వాతావరణ శాఖ చేసిన సూచనలే.. దీనికి కారణం. ప్రకాశం జిల్లాలో వచ్చే రెండు మూడు రోజుల పాటు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వెంటనే వైసీపీ కార్యాలయం.. ఓ ప్రకటన విడుదల చేసింది. వర్షం వచ్చేట్టుందని.. జగన్ బయటకు రారని.. పర్యటనను వాయిదా వేసుకున్నారని.. వర్షాలు తగ్గిన తర్వాత. సమయం చూసుకుని వస్తారని ప్రకటించింది.
కాగా.. పొదిలి అంటేనే పొగాకుకు ప్రత్యేక కేంద్రం. ఇక్కడ రైతులు పండించిన పొగాకుకు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా పేరుంది. అయితే.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడు కుల కారణంగా.. పొగాకు విక్రయాలు మందగించాయి. ఈ విషయంపై సర్కారుసరైన ప్రచారం చేయక పోవడంతోపాటు రైతులకు కూడా అవగాహన కల్పించకపోవడంతో వారు గత వారం రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే జగన్ పొగాకు రైతులను పరామర్శించి.. వారిని ఉద్దేశించి మాట్లాడాలని అనుకున్నారు.
కానీ, వర్షం సూచనలతో(హెచ్చరికలు కావు) ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో రైతుల సంగతి ఎలా ఉన్నా.. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, కార్యకర్తలు మాత్రం డీలా పడ్డారు. గతంలోనూ రెండు పర్యటనలను వేర్వేరు కారణాలతో చివరి నిముషంలో రద్దు చేసుకున్నారని నాయకులు చెబుతున్నారు.