మహానాడు వేదికగా సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూటమిపై మాట్లాడుతూ… గత ఎన్నికల్లో కూటమి పార్టీలు దిగ్విజయం సాధించాయని చెప్పారు. 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్‌తో జనసేన, 98 శాతం స్ట్రయిక్ రేట్‌తో టీడీపీ విజయం సాధించాయని, ఈ విజయ పరంపర మున్ముందు కూడా కొనసాగాలని పిలుపునిచ్చారు. అనేక మంది కూటమిని స్వాగతించారని.. కొందరు వ్యతిరేకించారని చెప్పారు. అయితే.. కూటమి పార్టీల ఐక్యత, విజయం చూసిన తర్వాత.. విమర్శలు చేసిన వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు.
మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో.. అనేక సమస్యలు ఉన్నాయని.. అయినా.. పార్టీనాయకులకు కలివిడి గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పెద్ద కొండను ఢీ కొట్టేందుకు కావాల్సిన శక్తి ఇవ్వాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని చెప్పారు. తెలుగు ప్రజల కోసం.. తెలుగు వారి సంక్షేమం కోసం.. కూటమిగానే ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రతి ఒక్కరినీ గౌరవించుకుంటూ.. ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు.
నాయకులపై నమ్మకం కలిగిస్తానని చంద్రబాబు చెప్పారు. “గత ఎన్నికలకు ముందు మేం సూపర్ సిక్స్ ప్రకటించాం. అదేసమయంలో జిల్లా స్థాయి నాయకులు కూడా.. వారి వారి నియోజకవర్గాల్లో కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని కూడా తీర్చే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ అమలు చేస్తాం.” అని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్‌ను కూడా సంపూర్ణంగా అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంపొందిస్తామన్నారు.
టీడీపీ యూనివర్సిటీ..
టీడీపీని రాజకీయ యూనివర్సిటీగా చంద్రబాబు అభివర్ణించారు. ఏ పార్టీలో చూసినా.. ఈ యూనివర్సిటీలో రాజకీయాలు నేర్చుకున్న వారే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. విలువలు, విశ్వసనీయత, పారదర్శకతకు పార్టీ పెద్దపీట వేసింది.. వేస్తోందని చెప్పారు. పాలన అంటే.. హత్యా రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలేనని గత వైసీపీ ప్రభుత్వం చెప్పకనే చెప్పిందన్న చంద్రబాబు.. తాము పారదర్శకతకు, ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని.. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని స్పష్టం చేశారు.