రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించి… అందులో భాగంగానే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా దక్కిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా జగన్ పార్టీకి నిజంగానే ఇచ్చి పడేశారు. జగన్ కోటరీ అంటూ ప్రస్తావిస్తూ సాగిన ఆయన ప్రకటన… తననే జగన్ కోటరీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తనకు అనుంబంధం ఉందన్న సాయిరెడ్డి… కేవలం కోటరీ చెప్పిన మాటలు విని జగన్ తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక టీడీపీ కీలక నేత, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న టీడీ జనార్ధన్ తో తాను భేటీ అయినట్లుగా వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కూడా సాయిరెడ్డి వివరణ ఇచ్చారు. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంతో తనకు ఏళ్ల తరబడి అనుబంధం ఉందన్న సాయిరెడ్డి… కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడికి టీడీ జనార్ధన్ వస్తారని తనకు తెలియదని, ఆయన వచ్చినా… తామేమీ మాట్లాడుకోలేదని కూడా సాయిరెడ్డి తెలిపారు.
ఇక టీడీపీ నేతలతో తాను కలవనని గతంలోనే చెప్పానని సాయిరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కలవాలి అనుకుంటే… తానే స్వయంగా చంద్రబాబును గానీ, లోకేశ్ ను గానీ బహిరంగంగానే కలుస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ లు తనకు రాజకీయ ప్రత్యర్థులే… అయితే అది గతం.. ఇప్పుడు కాదు అని ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబు, లోకేశ్ లను కలిసే వెసులుబాటు ఉన్నా తానెందుకు ఇతరులను కలుస్తానని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ జన్మకు తాను టీడీపీలో చేరేది లేదని ఇదివరకే చెప్పానని కూడా సాయిరెడ్డి గుర్తు చేశారు.
ఇక ఇప్పుడు కూడా తాను వైసీపీ ప్రచారంపై ఎందుకు స్పందిస్తున్నానన్న విషయాన్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. జగన్ కోటరీ తనను గిల్లడం వల్లే తాను ఇప్పుడు స్పందించాల్సి వస్తోందని ఆయన అన్నారు. అయినా ఎవరో కోటరీ చేసిన నేరాలను నా నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు,లేదంటే వెన్నుపోటుదారుడా? అని ఆయన జగన్ ను నిలదీశారు. 2011లో జగన్ అడిగారని 21 కేసులను తన నెత్తిన వేసుకున్నానని చెప్పిన సాయిరెడ్డి… 2025లో కూడా జగన్ అడిగి ఉంటే… తాజా కేసులనూ తనపైనే వేసుకునే వాడిని అన్నారు. అయితే జగన్ తాను నేరుగా అడగకుండా కోటరీ చేత అడిగించి తనను దూరం పెట్టారని సాయిరెడ్డి ఆరోపించారు. మొత్తానికి సాయిరెడ్డి స్పందించిన ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates